సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం అర్బన్: స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సంఘ ప్రతినిధులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని ఏపీ ఎన్‌జీజీవో కార్యాలయంలో ఆదివారం ఐక్య సమావేశం నిర్వహించారు. ఇటీవల మరణించిన 40 మంది ఉద్యోగులకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు కలిసి ఇక మీదట జిల్లాలోని ఉద్యోగులకు బాసటగా నిలచి కలిసి పోరాడాలని తీర్మానించారు. అనంతరం ఏపీ ఎన్‌జీజీవో జాయింట్ సెక్రటరీ కూన వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగుల ఆత్మ గౌరవం దెబ్బతీసేలా కొందరు అధికారులు ప్రవర్తించటం తగదన్నారు. పదోన్నతులు, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘ ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


