రాష్ట్ర శకటం ప్రదర్శన
భువనేశ్వర్: న్యూఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కర్తవ్య పథ్‌పై ప్రదర్శితమైన పలు ఆకర్షణీయమైన శకట ప్రదర్శనల్లో రాష్ట్ర శకటం చోటు చేసుకుంది. ఒడిశాకు గర్వకారణమైన సుసంపన్నమైన చేతి వృత్తులు, సంస్కృతి, కొరాపుట్ కాఫీ మరియు రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న సెమీ కండక్టర్ పరిశ్రమను ఈ శకటం కళాత్మకంగా ప్రదర్శించింది. సంప్రదాయం మరియు సాంకేతికత అద్భుతమైన సమ్మేళనంతో కర్తవ్య పథ్‌లో కదిలిన రాష్ట్ర శకటం ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.
తల్లిదండ్రులకు అపూర్వ గౌరవం
రాయగడ: సమాజ సేవకు ప్రోత్సహిస్తున్న తమ తల్లిదండ్రులను వారి పిల్లలు ఉన్నతంగా గౌరవించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక రామలింగేశ్వర మందిరం ప్రాంగణంలో ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు తమ తల్లిదండ్రులకు ఘనంగా సన్మానించారు. సేవా ధృక్పథంతో తమకు ఎల్లవేళలా అండగా నిలిచినవారిని సత్కరించడం అనందంగా ఉందని క్లబ్ అధ్యక్షుడు మోనింగి శ్రీహరి, కార్యదర్శి కింతలి శ్రీధర్, కోశాధికారి లాడి నూకరాజులు తెలియజేశారు.
క్రికెట్ మ్యాచ్‌లో అధికారుల జట్టు విజయం
పర్లాకిమిడి: జిల్లా ప్రెస్‌క్లబ్, జిల్లా కలెక్టరేట్ జట్టు మధ్య జరిగిన స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్‌లో అధికారుల జట్టు విజయం సాధించింది. స్థానిక శ్రీకృష్ణచంద్ర గజపతి కళాశాలలో సోమవారం మధ్యాహ్నం ఇరుజట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఫుల్గునీ మఝి ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలుత టాస్ గెలిచిన జిల్లా కలెక్టరేట్ జట్టు బ్యాంటింగ్ చేసి, నిర్ణీత 12 ఓవర్లలో 138 పరుగులు చేసింది. అనంతరం ప్రెస్‌క్లబ్ జట్టు 12 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 94 పరుగులే చేయగలిగింది. దీంతో జిల్లా కలెక్టరేట్ జట్టు ట్రోఫీ కై వసం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కలెక్టరేట్ జట్టు బ్యాట్స్‌మన్ సంతోష్ ప్రధాన్ నిలిచారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాధికారి త్రినాథ సాహు, జిల్లా పరిషత్ అదనపు సీడీవో ఫృథ్వీరాజ్ మండల్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఆలయ స్వాగత ద్వార ప్రతిష్ట
జయపురం: పట్టణంలోని కొత్తవీధి 5వ లైన్‌లో వేంచేసి ఉన్న మా మంగళ దేవి ఆలయ స్వాగత ద్వార ప్రతిష్ట ఉత్సవాలు సోమవారం వైభవంగా నిర్వహించారు. స్వాగత ద్వారం నిర్మాణానికి గతంలో బీజేడీ ప్రభుత్వం రూ.8 లక్షలు మంజూరు చేసింది, ఆ నిధులతో అతి సుందరంగా నిర్మించారు. మా మంగళ దేవి ఆలయ కమిటీ పెద్ద ప్రసాద్ పురోహిత్ దంపతులు పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో జయపురం మున్సిపల్ కౌన్సిలర్ జైపాల్ సింగ్, అజయ కుమార్ రాయ్, గుప్తేశ్వర పాణిగ్రహి, ఎ.వేంకటరావు, లాలుకృష్ణ, ఎస్.సుధీర్ ఆచార్య, సుజిత్ పట్నాయిక్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర శకటం ప్రదర్శన
రాష్ట్ర శకటం ప్రదర్శన


