ఆర్‌ఆర్‌ఆర్ కేంద్రం ప్రారంభం
రాయగడ:
స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల సమీపంలోని ఆహార కేంద్రం వద్ద రెడ్యూస్, రీయూజ్, రీ సైకిల్ (ఆర్‌ఆర్‌ఆర్) కేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ మహేష్ కుమార్ పట్నాయక్ సోమవారం ప్రారంభించారు. పట్టణ ప్రజలకు వినూత్న సేవా కేంద్రాన్ని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రజల నుంచి వారికి అవసరం లేనటువంటి వస్తువులను సేకరించి అవసరమైనవారికి తిరిగి పంపిణీ చేయడమే ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఇది పర్యావరణ కాలుష్యాన్ని కొంతవరకు నివారించడంతో పాటు సమాజంలోని అట్టడుగు వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు. పట్టణంలోని ప్రజలు దుస్తులు, చెప్పులు, బూట్లు, బ్యాగులు అదేవిధంగా ఆహార ప్యాకెట్లు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, గృహోపకరణాల బొమ్మలు మొదలైనవి ఈ కేంద్రానికి విరాళంగా అందిస్తే, వాటిని తిరిగి నిరుపేదలకు పంపిణీ చేసే అవకాశం లభిస్తుందన్నారు. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శుభ్రా పండ, కార్య నిర్వాహక అధికారి కులదీప్ కుమార్, కౌన్సిలర్లు హాజరయ్యారు.
ఆర్‌ఆర్‌ఆర్ కేంద్రం ప్రారంభం


