కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి
జయపురం: కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు యువ కాంగ్రెస్ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని సీనియర్ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక జిల్లా కాంగ్రెస్ భవనంలో నిర్వహించిన యువజన కాంగ్రెస్ ఆర్గనైజింగ్ శిక్షణ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రూపక్ తురుకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రంజిత్ పాత్రో కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. పార్టీకి యువతే వెన్నెముక అని, క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రజా సమస్యలపై ఉద్యమాలు నడపాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మీనాక్షి బాహిణీపతి యువ కాంగ్రెస్ రాజనైతిక మార్గదర్శకాలపై కార్యకర్తలను శిక్షణ ఇచ్చారు. పార్టీని బలోపేతం చేయడం, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక బాధ్యతలు, ప్రజాసేవ, నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవడం తదితర విషయాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రతినిధి, జిల్లా మైనారిటీ కాంగ్రెస్ సెల్ అధ్యక్షుడు హసన్ మధాని, మల్కన్‌గిరి మాజీ ఎమ్మెల్యే నిమైయ్ చరణ్ సర్కార్, జయపురం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బసంత నాయిక్ తదితరులు పాల్గొన్నారు.


