రాజ్యలక్ష్మి అమ్మవారికి విశేష అలంకరణ
రాయగడ: స్థానిక బాలాజీనగర్‌లోని కళ్యాణవేంకటేశ్వర మందిరంలో ధనుర్మాస పూజల్లో భాగంగా శుక్రవారం రాజ్యలక్ష్మి అమ్మవారికి విశేష అలంకరణ చేశారు. అమ్మవారితో పాటు గోదాతాండవ కృష్ణులను పూలతో అలంకరించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యుల ఆధ్వర్యంలో ధనుర్మాస పూజలు కొనసాగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
రైల్వే సమస్యలపై వినతి
పర్లాకిమిడి: పూరీలోని స్వస్థీ హోటల్‌లో శుక్రవారం జరిగిన రైల్వే స్టాండింగ్ కమిటీ సమావేశానికి పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి హాజరై పలు సమస్యలను ప్రస్తావించారు. సమావేశానికి రాజ్యసభ ఎంపీ సీహెచ్ రమేష్ అధ్యక్షత వహించారు. పర్లాకిమిడి రైల్వే స్టేషన్ వద్ద కింగ గ్రామం, శాంతినగర్ వాసుల కోసం ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, బద్రక్ నుంచి పలాసకు నడుస్తున్న డీఎంయూ రైలును పర్లాకిమిడి వరకూ పొడిగించాలని, గుణుపురం నుంచి వయా పలాస మీదుగా హైదరాబాద్‌కు రైలు వేయాలని కోరుతూ ఎంపీ సీహెచ్.రమేష్‌కు ఎమ్మెల్యే వినతి పత్రాన్ని సమర్పించారు. పర్లాకిమిడిలో కొత్తగా నిర్మించిన రైల్వేస్టేషన్ బయట పరలా మహారాజా శ్రీక్రిష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని విన్నవించారు. స్టాండింగ్ కమిటీ సమావేశంలో రాజ్యసభ సభ్యులు శుభాషిష్ ఖుంటియా, ఎంపీలు దమ్‌దార్ అగ్రవాల్, తారిక్ అన్వర్, సంగీతా సింహా దేవ్, శతాబ్దిరాయ్‌లు పాల్గొన్నారు.
10వ తేదీ నుంచి గ్రీన్ స్టిక్కర్
భువనేశ్వర్: వాహన కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రాలు ఉన్న వారికి గ్రీన్ స్టిక్కర్ లభిస్తుంది. ఈ నెల 10వ తేదీ నుంచి ఈ స్టిక్కర్లు అందుబాటులో ఉంటాయని రవాణా శాఖ ప్రకటించింది. రోడ్డు రవాణా కార్యాలయంలో (ఆర్టీవో)ల వద్ద గ్రీన్ స్టిక్కర్లు జారీ చేస్తారు. ఈ మేరకు అన్ని ఆర్టీవోల వద్ద ప్రత్యేక కౌంటర్లు తెరవనున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధి కమిషనర్‌గా దేవ్ రంజన్
భువనేశ్వర్ : రాష్ట్ర అభివృద్ధి కమిషనర్‌గా అదనపు ప్రధాన కార్యదర్శి దేవ్ రంజన్ కుమార్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఉదయం 10.15 గంటలకు ప్రణాళిక, సమన్వయ విభాగంలో ఉన్న అభివృద్ధి కమిషనర్ కార్యాలయానికి చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులు కొత్త అభివృద్ధి కమిషనర్‌కు స్వాగతం పలికారు. అందరి సహకారంతో తాను పనిచేస్తానని ఆయన అన్నారు.
రాజ్యలక్ష్మి అమ్మవారికి విశేష అలంకరణ
రాజ్యలక్ష్మి అమ్మవారికి విశేష అలంకరణ


