రచనలు సమాజ శ్రేయస్సును కాంక్షించాలి
రాయగడ: రచయితలు నిరంతరం సాహిత్యంపై పట్టు పెంచుకోవడంతో పాటు వారి రచనలు సమాజ శ్రేయస్సును కాంక్షించాలని కవి, రచయిత డాక్టర్ పతివాడ తులసీదాస్ అన్నారు. స్థానిక రాజ్‌భవన్‌లో రాయగడ రచయిత సంఘం (రారసం) అధ్యక్షుడు టీవీఎన్ అప్పారావు అధ్యక్షతన శనివా రం జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. సాహిత్యంపై ప్రస్తుతం యువత పట్టుతప్పుతున్నారని, వారికి అవగాహన కలిగేలా రచయితలు సరైన ప్రోత్సాహాన్ని ఇవ్వాలని సూచించారు. రారసం సహ కార్య దర్శి మామిడి గణపతిరావు మాట్లాడుతూ రారసం ద్వారా ఎంతోమంది కొత్త కవులు తమ కలానికి పదును పెడుతున్నారన్నారు. వారిలో సాహితీ కుసుమాలు మెరిసేలా అంతా కలిసికట్టుగా కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. స్థానికంగా స్పందన వంటి సాహితీ సంస్థలు రాయగడలో ఇటీవల ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో పిన్నింటి అప్పారావు, పీవీఆర్ మోహనరావు, సింగిడి రామారావు, భళ్లమూడి నాగరాజు, భళ్లమూడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అపచారం
భువనేశ్వర్: పూరీ శ్రీమందిరం లోపలికి బూట్లు వేసుకొని గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించినట్లు భావిస్తున్నారు. శ్రీమందిరం లోపలి ప్రాకారంలో ప్రతిహారి సేవకుడు భోగ మండపం దగ్గర షూ జతను గుర్తించారు. తక్షణమే ఈ అపచారంపై స్పందించిన సేవాయత్ షూను బయటకు తీసుకొచ్చి అనుబంధ వర్గాల దృష్టికి తీసుకెళ్లాడు. ఈ ఘటనలో శ్రీమందిరంలోని సీసీ టీవీని తనిఖీ చేసి, అపచారానికి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ తెలియజేశారు.
విమానాశ్రయంలో
గంజాయి స్వాధీనం
భువనేశ్వర్: స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.8 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి భువనేశ్వర్‌కు చేరిన ప్రయాణికుడి లగేజీ తనిఖీలో ఈ అక్రమ రవాణా గుట్టు రట్టు అయింది. ఆ ప్రయాణికుడి లగేజీలో 8 కిలోల గంజాయిని తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
రచనలు సమాజ శ్రేయస్సును కాంక్షించాలి


