
వనామీకి.. వరుణ గండం..!
అవగాహన పెంచుకోవాలి
పోలాకి: ఒకప్పుడు రొయ్యల సాగు చేసే ఆక్వా రైతు మీసం మెలేసే పరిస్థితుల నుంచి, ఏరోజుకు ఏరూపంలో కష్టనష్టాలు ఎదురొస్తాయోనని నిత్యం భయపడేస్థాయికి మారింది పరిస్థితి. ఇప్పుడు తాజాగా వర్షాకాలం కావడంతో నూట్రిషన్స్ కొరత రూపంలో కొత్తకష్టం వచ్చిపడింది. జిల్లాలో ఎక్కువగా ఉప్పునీటి వనామీ కల్చర్ సాగు చేస్తున్న రైతులు చెరువుల్లో నీటిని నిల్వచేసే సమయంలో 10 శాతం కనిష్ట స్థాయి నుంచి 30 శాతం గరిష్ట స్థాయి వరకు లవణ శాతాన్ని కొనసాగిస్తారు. అదే క్రమంలో రొయ్యల ఎదుగుదలకు అవసరమైన ప్రోటీన్లు, లిపిడ్లు, కార్బోహైడ్రేట్స్, విటమిన్లు, ఖనిజాలు మరియు ఇతర పోషకాలు సైతం ఉండేలా ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇటీవల వర్షాలకు చెరువుల్లో వర్షపు నీరు చేరడంతో ఆ నీటిని బయటకు తోడాల్సి వస్తోంది. దీంతో సదరు లవణ శాతంతో పాటు పోషకాలు కూడా బయటకు పోతున్నాయి. ఫలితంగా రొయ్య ఎదుగుదలలో మేతతో సమానంగా అందాల్సిన పోషకాల కొరత ఏర్పడుతోంది. ఈ సమయంలో మళ్లీ ప్రొబయోటిక్స్ మొదలుకుని నూట్రిషన్స్ బ్యాలెన్స్ చేయడం కోసం వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ ఒడిదుడుకుల నేపథ్యంలో ధరలు సైతం పతనమైన పరిస్థితుల్లో మళ్లీ పోషకాల కోసం అదనపు ఖర్చులు పెట్టాలంటే తడిసిమోపుడవుతోందని వాపోతున్నారు.
సబ్సిడీపై పట్టించుకోని పాలకులు
ఆక్వా సాగులో కేవలం పోషకాల కోసం మొత్తం సాగు ఖర్చులో 20 శాతం కేటాయించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే పోషకాలు సబ్సిడీపై అందించాలని ఎప్పటినుంచో రొయ్యల రైతులు, సంబంధిత సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ప్రధాన పోషకాలైన మెగ్నీషియం, కాల్సియం, సోడియం, పొటాషియం, క్లోరైడ్స్ వంటివి రాయితీపై అందిస్తే కొంత ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. మార్కెట్‌లో ఎకరాకు అయ్యే పోషకాల విలువ దాదాపుగా రూ.2,500 వరకు ఉంది. పంటకాలంలో పరిస్థితులను బట్టి 10 నుంచి 12 సార్లు వాడాల్సి ఉండగా వర్షాకాలం అదనంగా మరో 5 దఫాలుగా వాడుతున్నారు. అయితే సదరు పోషకాలు సబ్సిడీపై అందించాలని ఎప్పటినుండో ఆక్వా రైతులు డిమాండ్ చేస్తున్నప్పటికీ పాలకులు పట్టించుకోవడం లేదు. అందువలన ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పోషకాల ఖర్చును గుర్తించి ఆక్వా రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
రొయ్యల ధరల్లో అనేక కారణాలతో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ పోషకాల ధరలు మాత్రం ప్రతిఏటా పెరుగుతున్నాయి. గతంతో పోల్చితే పోషకాల వినియోగం ఎక్కువైంది. వర్షాకాలంలో నీటిని బయటకు తోడితే పోషకాలు సైతం మళ్లీ అందించాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి ఆక్వా అభివృద్ధి కోసం పోషకాలు రాయితీపై అందిస్తే బాగుటుంది.
– పల్లి సింహాచలం, ఆక్వా రైతు, డీఎల్‌పురం
ఒకప్పుడు విద్యుత్ లేదా డీజిల్ కోసం పెట్టే ఖర్చుతో చాలా ఇబ్బంది ఉండేది. ప్రభుత్వాలు కల్పించుకుని రాయితీ ఇవ్వడంతో ఆ ఖర్చులు బాగా తగ్గాయి. ఆదే క్రమంలో పోషకాలు, మేతలు, రొయ్య పిల్లలకు సైతం రాయితీలు దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తే ఆక్వా మరింత అభివృద్ధి దిశగా అడుగులు పడతాయి. దీంతో ఉపాధి అవకాశాలు సైతం మెరుగుపడే అవకాశం ఉంది.
– తిర్లంగి శ్రీనివాసరావు,
ఆక్వా రైతు, పిన్నింటిపేట
ఆక్వా రైతులు పోషకాల వినియోగంపై ఇంకా అవగాహన పెంచుకోవాల్సి ఉంది. కేవలం అవగాహనతోనే పోషకాల ఖర్చుల్లో నియంత్రణ వస్తుంది. రొయ్యలు లేదా చేపల పెంపకంలో నీరుకూడా దాగి ఉన్న పోషకంగా పరిగణించబడుతుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నీటిని బయటకు తోడాల్సి వచ్చినపుడు అదనపు పోషకాలు అందించక తప్పదు.
– డాక్టర్ హెచ్.డిల్లీశ్వరరావు, ఫిషరీస్ అసిస్టెంట్, గుప్పెడుపేట సచివాలయం
చెరువుల్లో చేరుతున్న వర్షపు నీరు
నీటిని తోడే క్రమంలో పోషకాలు కోల్పోతున్న వైనం
అదనపు ఖర్చు అవుతోందని ఆక్వా రైతు ఆందోళన

వనామీకి.. వరుణ గండం..!

వనామీకి.. వరుణ గండం..!

వనామీకి.. వరుణ గండం..!

వనామీకి.. వరుణ గండం..!