
ఆరో తరగతి బాలికకు గర్భం
రాయగడ: జిల్లాలోని కల్యాణసింగుపూర్‌లో ఆరో తరగతి చదువుతున్న బాలిక గర్భం దాల్చింది. ప్రేమ పేరుతో ఓ యువకుడు ఆమెను మోసగించాడు. ఇతడు ప్లస్ టూ చదువుతున్నాడు. బాలిక శరీరంలో మార్పులు గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్ష చేయగా ఆమె గర్భం దాల్చినట్లు తేలింది. ఆమెను ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. దీంతో తల్లిదండ్రులు కల్యాణసింగుపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించారు.
సారాతో ఇద్దరు అరెస్టు
జయపురం: సారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్లు జయపురం అబ్కారి విభాగ అధికారి శుబ్రత్ కేశరి హిరన్ శనివారం తెలిపారు. అరెస్టు అయిన వారిలో ఒక మహిళ ఉందని వెల్లడించారు. ఇరువురిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరచామని, బైలు మంజూరు కాకపోవటం వలన వారిని జైలుకు పంపామన్నారు. శుక్రవారం సాయంత్రం అబ్కారి సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుంగా నరసింహ, ఓ మహిళ జయనగర్ గ్రామం సమీపంలో సారా తీసుకువస్తుండగా పట్టుబడ్డారన్నారు. ఎ.ఎస్.ఐ బలరాం దాస్, అబ్కారి సిబ్బంది పాల్గొన్నారు.
ఇద్దరు అరెస్టు
పర్లాకిమిడి: గజపతి జిల్లా గుసాని సమితి ఉప్పలాడ గ్రామం శబరనగర్ వద్ద నిషేధిత అటవి పందిని వేటాడి మాంసం అమ్ముతున్న సమాచారం అందుకున్న దేవగిరి రేంజ్, కోర్సండ్ బీట్ అటవీ అధికారులు ఇద్దరు వేటగాళ్లను పట్టుకుని శనివారం కోర్టుకు తరలించారు. ఇద్దరు నిందితులు ఇప్రియం శోబోరో, ఏసాకో భుయ్యాన్ వద్ద 8 కిలోల అడవి పంది మాంసం, ఒక మోటార్ సైకిల్, అయిదు కత్తులు, కీప్యాడ్ మొబైల్‌ను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వన్యమృగాల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్టు డీఎఫ్‌ఏ కె.నాగరాజు తెలిపారు.
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల నిరసన
అరసవల్లి: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిబ్బంది శనివారం శాంతియుత నిరసన చేపట్టారు. డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట సంఘ జిల్లా అధ్యక్షురాలు ఉష ఆధ్వర్యంలో ఆరోగ్యమందిర్‌లో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న 573 మంది ఈ నిరసనలో పాల్గొన్నారు. నియామకాలు జరిగి ఆరేళ్లు గడుస్తున్నా తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరారు. ఇన్సెంటివ్‌తో పాటు ఏటా 5 శాతం ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ఆరో తరగతి బాలికకు గర్భం