భువనేశ్వర్: రాష్ట్ర శాసన సభలో గురువారం వినూత్న నిరసన ప్రదర్శనతో కాంగ్రెస్ సభ్యులు గోల చేశారు. మహిళలపై జరుగుతున్న దురాగతాలపై నిరసించారు. మరో వైపు తారా ప్రసాద్ బాహిణీపతి సస్పెన్షన్‌ను నిలదీసిన ప్రతిపక్ష బిజూ జనతా దళ్, కాంగ్రెస్ సభ్యుల తీరుతో సభలో గందరగోళం నెలకొంది. సరికొత్తగా కాంగ్రెస్ సభ్యులు నల్లని పీలికల్ని ధరించి సభలో ఈల వేసుకుని గోల గోల చేశారు. సభలో ఈల గోల నివారించాలని స్పీకరు చేసిన అభ్యర్థనల్ని సైతం లెక్క చేయకుండా నిరవధికంగా నిరసన కొనసాగించారు. ఈ నేపథ్యంలో గురువారం శాసన సభ వరుసగా రెండు సార్లు వాయిదా పడింది. శాసన సభ కార్యకలాపాలు విషాదకరంగా ప్రారంభమయ్యాయి. మాజీ బిజూ జనతా దళ్ ఎమ్మెల్యే దేబ రాజ్ సేఠ్ మృతికి సంతాపంగా ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా ఒక నిమిషం మౌనం పాటించాలని ప్రతిపాదించారు. ప్రతిపక్ష నాయకుడు నవీన్ పట్నాయక్, కాంగ్రెస్ సభ్యులు కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు ప్రకటించారు. అనంతరం మొదలైన ప్రశ్నోత్తరాల సమయంలో గందరగోళం ప్రారంభమైంది. కాంగ్రెస్‌కు చెందిన ప్రతిపక్ష సభ్యులు సభలో గందరగోళం సృష్ట్టించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ముఖేష్ మహాలింగ్ ప్రసంగిస్తున్న సమయంలో అనేక మంది కాంగ్రెస్ సభ్యులు తమ సీట్ల నుంచి లేచి స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. మరి కొంత మంది సభ్యులు ఈల వేసుకుంటు సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు. మహిళలపై జరుగుతున్న దారుణాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు నినాదాలు చేసిన నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు తారా ప్రసాద్ బాహిణీపతిని ఇటీవల సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ సభ్యులు నల్లటి పీలికలు ధరించి తీవ్ర నిరసనలు తెలిపారు. స్పీకర్ పదే పదే అభ్యర్థించినప్పటికీ ప్రతిపక్ష సభ్యుల గందరగోళం ఆగకపోవడంతో సభను మొదట మధ్యాహ్నం 12 గంటలకు, మళ్లీ మధ్యాహ్నం 12.30 గంటలకు వాయిదా వేశారు.
కాంగ్రెస్ సభ్యుల వినూత్న నిరసన