గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు..ఒడిశా శకటానికి ఆమోదం
భువనేశ్వర్: గణతంత్ర దినోత్సవం 2026 కవాతులో రాష్ట్ర శకటం ప్రదర్శనకు అనుమతి లభించింది. న్యూ ఢిల్లీలో కర్తవ్య పథంలో గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ఒడిశా శకటం ప్రదర్శించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్ర రక్షణ శాఖ ఆమోదించింది. పరేడ్ కోసం ఒడిశాతో సహా 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శకటాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వార్షిక వేడుకల్లో భాగంగా కర్తవ్య పథ్ వద్ద ఈ శకటాలను ప్రదర్శించనున్నారు. ఒడిశా ప్రభుత్వం తన శకటం ద్వారా రాష్ట్ర సాంస్కృతిక, సంప్రదాయ వారసత్వాన్ని ప్రదర్శించనుంది. జనవరి 19 నాటికి శకటాలు పూర్తిగా సిద్ధం చేయాలని కేంద్ర రక్షణ శాఖ ఎంపిక చేసిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను కోరింది. 2025 గణతంత్ర దినోత్సవ పరేడ్ కోసం రాష్ట్ర ప్రతిపాదనను కేంద్రం గతంలో తిరస్కరించింది. గత సంవత్సరం ఒడిశా ప్రభుత్వం తన శకటంలో కందమల్ వస్త్రాలు, మణియాబొందొ చీరలను ప్రదర్శించాలని ప్రణాళిక వేసింది. ఆ ప్రతిపాదనకు కేంద్ర ఎంపిక కమిటీ నుంచి అనుమతి లభించలేదు. ఈ దశలో తిరస్కరణకు గురైన రాష్ట్ర ప్రతిపాదిత శకటానికి కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీలో జరిగిన భారత్ పర్వ 2025 సందర్భంగా ఒడిశా తన శకటాన్ని ప్రదర్శించడానికి అనుమతించింది. తద్వారా రాష్ట్రానికి దాని సాంస్కృతిక, సంప్రదాయాలను జాతీయ స్థాయి వేడుకలో ప్రదర్శించే లక్ష్యం నెరవేరింది. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ కార్యక్రమాల్లో ఒకటైన గణతంత్ర దినత్సోవ పరేడ్‌లో ఒడిశా తన సాంస్కృతిక గుర్తింపును మరోసారి తెరపైకి తీసుకురావడానికి ఒక అవకాశంగా భావిస్తున్నారు.


