సమాజహితమైన ప్రాజెక్టులకు ప్రాధాన్యమివ్వాలి
● హైదరాబాద్ ఐఐటీ డీన్ మల్లారెడ్డి
● టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ముగిసిన ఆవిష్కార్
టెక్కలి: సమాజానికి హితమైన ప్రాజెక్టులను రూపకల్పన చేసేవిధంగా నైపుణ్యతకు ప్రాధాన్యమివ్వాలని హైదరాబాద్‌కు చెందిన ఐఐటీ డీన్ సి.మల్లారెడ్డి అన్నారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో గత మూడు రోజులుగా జరుగుతున్న ఆవిష్కార్ హ్యాక్‌థాన్ సీజన్–3 సాంకేతిక కార్యక్రమం సోమవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మల్లారెడ్డి విద్యార్థులనుద్దేశించి సూచనలు అందజేశారు. యువ ఇంజినీరింగ్ విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాన్ని, సృజనాత్మక ఆలోచనలను వెలికితీయాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ సాంకేతిక ఆవిష్కరణల శిబిరం విశేష విజయాన్ని సాధించిందన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించడం సంతోషకరమన్నారు. విద్యార్థులు రూపొందించిన వినూత్న సాంకేతిక ప్రాజెక్టులు పరిశ్రమలు, సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లో మొదటి బహుమతి విశాఖపట్నంకు చెందిన జన్నోగజెనిక్స్ ఎన్‌ఎస్‌ఆర్ ఐటీకు రూ.1.25 లక్షలు, గుజరాత్‌కు చెందిన మైండ్ మోషన్ పారుల్ యూనివర్సిటీకి రెండో బహుమతి రూ.1 లక్ష, తమిళనాడుకు చెందిన కాస్మోస్ అమృత యూనివర్సిటీ విద్యార్థులు మూడవ బహుమతి రూ.75 వేలు గెలిపొందారు. కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ వీవీ నాగేశ్వరరావు, కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, కోశాధికారి టి.నాగరాజు, మనోజ్ కుమార్, సతీష్ కుమార్, బీవీ రమణతదితరులు పాల్గొన్నారు.


