ఒడిశా రైలు ప్రమాద ఘటన.. నిందితుల రిమాండ్‌ పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

ఒడిశా రైలు ప్రమాద ఘటన.. నిందితుల రిమాండ్‌ పొడిగింపు.. ముమ్మర విచారణ

Jul 12 2023 10:12 AM | Updated on Jul 12 2023 10:41 AM

- - Sakshi

భువనేశ్వర్‌: బాలాసోర్‌ జిల్లా బహనాగా బజార్‌ స్టేషన్‌ వద్ద ట్రిపుల్‌ ట్రైన్స్‌ యాక్సిడెంట్‌ కేసులో ముగ్గురు నిందితుల రిమాండ్‌ను భువనేశ్వర్‌ ప్రత్యేక సీబీఐ కోర్టు పొడిగించేందుకు అనుమతించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అభ్యర్థన మేరకు కోర్టు అంగీకారం తెలిపింది. లోగడ జూలై 7న నిందితులకు 5 రోజుల రిమాండ్‌ను కోర్టు మంజూరు చేసింది.

రిమాండ్‌ను మరో నాలుగు రోజులు పొడిగించాలని కోర్టుకు దరఖాస్తు చేయడంతో అనుమతించినట్లు మంగళవారం కోర్టు ప్రకటించింది. ఈ సందర్భంగా నిందితులు సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ (సిగ్నల్‌) అరుణ్‌ కుమార్‌ మహంత, సెక్షన్‌ ఇంజనీర్‌ మహ్మద్‌ అమీర్‌ ఖాన్‌ మరియు టెక్నీషియన్‌ పప్పు కుమార్‌ని కోర్టులో హాజరుపరిచారు.

లోతుగా విచారణ
ఈ దుర్ఘటన వెనక అసలు నిజాలు బట్టబయలు చేసే దిశలో సీబీఐ విచారణ లోతుగా కొనసాగుతోంది. తొలి దశలో ముగ్గురుని అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్న దర్యాప్తు బృందం తాజాగా మరో ఇద్దరు రైల్వే సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది. వీరిలో బహనాగా బజార్‌ రైల్వేస్టేషను మాస్టర్‌ ఒకరు. సీబీఐ వీరిని సోమవారం నుంచి విచారించింది.

స్టేషను మాస్టరుతో సహా మరో సిబ్బందిని ప్రశ్నించింది. కాగా తాజాగా మరో ముగ్గురికి నోటీసులు జారీ చేసింది. వీరిని బుధవారం నుంచి ప్రశ్నించడం ఆరంభిస్తుంది. ఈ లెక్కన దర్యాప్తు బృందం 8 మందిపై దృష్టి సారించింది. లోగడ ముగ్గురు నిందితులను జూలై 7న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరికి వ్యతిరేకంగా ఐపీసీ సెక్షన్లు 304 (హత్య కాకున్న మరణానికి హేతువు) మరియు 201 (సాక్ష్యాధారాల గల్లంతు) కింద కేసులు నమోదు చేశారు. వీరిలో అరుణ్‌ కుమార్‌ మహంత మరియు అమీర్‌ ఖాన్‌ బెయిల్‌ కోసం దరఖాస్తు చేశారు.

సీఆర్‌ఎస్‌ విచారణలో...
రైల్వే భద్రతా కమిషనర్‌ (ఆగ్నేయ సర్కిల్‌) సీఆర్‌ఎస్‌ విచారణ నివేదికలో నార్త్‌ సిగ్నల్‌ గూమ్టీ (స్టేషన్‌) వద్ద సిగ్నలింగ్‌ సర్క్యూట్‌ మార్పులో లోపం కారణంగా ప్రమాదం జరిగిందని పేర్కొంది. జూన్‌ 2వ తేదీ సాయంత్రం కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బహనాగా బజార్‌ స్టేషన్‌లో స్థిరంగా ఉన్న సరుకు రవాణా రైలును ఢీకొట్టింది. అనంతరం దాని పట్టాలు తప్పిన కొన్ని కోచ్‌లను పక్క ట్రాక్‌పై వస్తున్న యశ్వంత్‌పూర్‌–హౌరా ఎక్స్‌ప్రెస్‌ ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 293 మంది మరణించారు.

ఇప్పటికీ పలువురి ఆచూకీ తెలియక మృతదేహాలు కంటైనర్లలో మగ్గుతున్నాయి. స్థానిక ఎయిమ్స్‌ ప్రాంగణంలో కంటైనర్లలో 41 శవాలు ఆచూకీ కోసం నిరీక్షిస్తున్నాయి. వీటిలో 10 శవాల డీఎన్‌ఏ పరీక్షల నివేదిక అందడంతో బంధు వర్గాలకు అప్పగించేందుకు సన్నాహాలు చేపట్టారు. నిబంధనల మేరకు మృతదేహాలను అప్పగిస్తారు. స్వస్థలాలకు తరలించలేని పరిస్థితుల్లో స్థానికంగా అంత్యక్రియలు ఉచితంగా నిర్వహించేందుకు స్థానిక నగర పాలక సంస్థ ఏర్పాట్లు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement