పాలనలో తనదైన ముద్ర వేసుకున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఉద్యోగ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా డాక్టర్ జి. లక్ష్మీశ బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తయింది. పాలనలో ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. జిల్లాలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి, పారదర్శక పాలన దిశగా ఆయన చేపట్టిన కార్యక్రమాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉంటూ, క్షేత్రస్థాయి పర్యటనలు, సమీక్షలు, అధికార యంత్రాంగ సమన్వయంతో జిల్లా అభివృద్ధికి చేస్తున్న కృషి అందరి మన్ననలు పొందుతోంది. రెండేళ్ల కాలంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు చేరవేయడం, విద్య, వైద్యం, మహిళా సాధికారత, పారిశ్రామికాభివృద్ధి, పర్యాటక రంగాల పురోగతికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు.
జాతీయ స్థాయి గుర్తింపు..
జిల్లా యంత్రాంగం చేపట్టిన వినూత్న కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఉపాధి కల్పనకు చేపట్టిన ‘ఎన్టీఆర్ వికాస్’ కార్యక్రమానికి స్కోచ్ సిల్వర్ అవార్డు, ప్రజాసేవల్లో వినూత్న ఆవిష్కరణలకు ‘ఇగ్నైట్ సెల్’ కార్యక్రమానికి స్కోచ్ గోల్డ్ అవార్డు లభించాయి. ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు ఆకాంక్షిత మండలాలు నీతి ఆయోగ్ ప్రశంసలు, స్వర్ణ పతకాలు సాధించాయి. ఆయన పాలనలో జిల్లా కలెక్టరేట్ మూడు ఐఎస్ఓ ధ్రువీకరణలు పొందడం విశేషం. స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు గుంటుపల్లిలో ఏర్పాటు చేసిన రైజ్ కేంద్రం గ్రామీణ మహిళలకు వరప్రదాయినిగా మారింది. ఒక కుటుంబం–ఒక పారిశ్రామికవేత్త అనే ప్రభుత్వ దార్శనికతకు ప్రతిబింబంగా నిలుస్తోంది.
అన్నింటా ప్రత్యేక కార్యదక్షత..
జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నారు. సరస్ మేళా వంటి భారీ జాతీయ స్థాయి ప్రదర్శనలు, ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. గ్రామీణ హస్తకళాకారుల జీవనోపాధి, సంక్షేమానికి తోడ్పాటునందిస్తూ కొండపల్లి బొమ్మల పండుగ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా సంప్రదాయ కళలకు ప్రోత్సాహం కల్పిస్తున్నారు. జిల్లా సంస్కృతి, చారిత్రక వారసత్వ పరిరక్షణకు వరల్డ్ మ్యూజియం డే, వరల్డ్ హెరిటేజ్ డే ఇలా వివిధ ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూ స్థానిక కళలు, కళాకారులకు, చరిత్రకు, సంస్కృతికి విస్తృత ప్రచారం కల్పించారు.
సాంకేతికత, నూతన ఆవిష్కరణల జోడింపు
పారదర్శక, సమర్థవంతమైన పాలనకు సాంకేతికతను జోడిస్తూ కలెక్టర్ వినూత్న విధానాలను అమలు చేస్తున్నారు. దసరా ఉత్సవాల్లో సాంకేతికతను వినియోగించారు. రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాను ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు.


