కృష్ణా విలాపం! | - | Sakshi
Sakshi News home page

కృష్ణా విలాపం!

Nov 25 2026 9:30 AM | Updated on Nov 25 2026 9:30 AM

కృష్ణా విలాపం! కరుణించని వరుణుడు.. కానరాని పరుగులు ● 2017–18లో బ్యారేజ్‌ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన పరిస్థితి లేదు. ● 2015–16లో కాలువలకు 41.99 టీఎంసీలు, మిగులు కేవలం 9.26 టీఎంసీలు కిందికి వదిలారు. ● అప్పట్లో తాగు, సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నాటి పరిస్థితులే పునరావృతం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ● అదే పరిస్థితి వస్తే డిసెంబర్‌ నుంచి మళ్లీ వర్షాకాలం ప్రారంభమయ్యే వరకు తాగు, సాగునీటి అవసరాలు ఎలా తీరుస్తారని రైతులు, రైతు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఈ ఏడాది మూడుసార్లే కడలివైపు సాగిన కృష్ణమ్మ తుపానులొస్తే గానీ నదికి వరద రాని పరిస్థితి విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ వద్ద పడిపోతున్న నీటి మట్టం ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో తాగునీటికీ కటకటే!

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): వరుణుడు కరుణించకపోవడంతో కృష్ణమ్మ బోసిపోయింది.. ఏటా ఈ సమయానికి బిరాబిరా పరుగులు పెడుతూ సాగరుడి ఒడిలోకి చేరే నదీమతల్లి మిన్నకుండి పోయింది.. ఏవైనా తుపానులు వచ్చి.. వరదలు వస్తే తప్ప ముందుకు కదల్లేని దుస్థితిలో నిలిచిపోయింది. తన రాక కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అన్నదాతల ఆశలకు గండి కొట్టింది. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు సాగితే తాగునీటికి అవస్థలు తప్పవన్న హెచ్చరికలు జారీ చేస్తూ.. ప్రభుత్వాన్ని మేల్కోలుపుతోంది.

కేవలం మూడు సార్లే..

ప్రస్తుతం కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజ్‌ వద్ద నీటి మట్టం క్రమేపీ పడిపోతోంది. ఈ ఏడాది ఖరీఫ్‌ మొత్తంలో కేవలం మూడు సార్లు మాత్రమే బ్యారేజ్‌ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నైరుతి రుతు పవనాలు ముగియడంతో ఇక సాధారణ వర్షాలు పడతాయన్న ఆశ లేదు. తుపానులు వస్తే తప్ప బ్యారేజ్‌లో నీటి మట్టం పెరిగే అవకాశం లేదు. ఈ ఏడాది సాగర్‌ నుంచి కిందికి నీటి విడుదలైన పరిస్థితి లేదు. ప్రస్తుతం బ్యారేజ్‌ వద్ద నీటి మట్టం నిలకడగా ఉంచేందుకు అధికారులు పులిచింతల నుంచి నీటిని తీసుకుంటున్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయే ఏడెనిమిది నెలల కాలంలో తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పదడుగుల లోపే..

ఈ ఏడాది ఖరీఫ్‌ ప్రారంభంలో కేవలం తాగునీటికి మాత్రమే నీటిని విడుదల చేస్తాం.. పంటలకు సాగునీరు ఇవ్వలేం.. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని జలవనరుల శాఖ అధికారులు అధికారికంగా ప్రకటన చేశారు. ఆ తర్వాత కూడా కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఎక్కడా సరైన వర్షాలు లేవు. డెల్టాలో రబీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నీటి మట్టం పడిపోతుండటంతో తాగునీటికి ఇబ్బందులు తప్పవేమోనన్న ఆందోళన నెలకొంది. బ్యారేజ్‌ వద్ద నీటి మట్టం 10 అడుగుల లోపే ఉంది. దీంతో రాబోయే రోజుల్లో తాగునీటి అవసరాలు కూడా తీర్చే పరిస్థితి కనిపించడం లేదు.

పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు..

ప్రకాశం బ్యారేజ్‌ గేట్లు ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం మూడంటే మూడుసార్లు మాత్రమే ఎత్తి కిందికి నీటిని విడుదల చేశారు. 2019–24 మధ్య ఏటా సమృద్ధిగా వర్షాలు కురవడంతో బ్యారేజ్‌ నుంచి కిందకు కృష్ణమ్మ పరుగులు పెట్టింది. ఈ ఏడాది జూన్‌లో తొలిసారి బ్యారేజ్‌ గేట్లు ఎత్తారు. ఆ తర్వాత సెప్టెంబర్‌, నవంబర్‌లో కేవలం ఒకటి రెండు రోజులు మాత్రమే గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. అది కూడా నామమాత్రంగానే. అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement