రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా సవరించిన షెడ్యూలు ప్రకారం 1,23,714 మంది ఏఎస్‌డీడీ ఓటర్లకు మరో అవకాశం కల్పించినట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. వీరందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు (ఈఎఫ్) పంపిణీ చేసి, స్వీకరించి పరిశీలించామన్నారు. ఈసీఐ కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో రాజకీయ పక్షాలు సహకరించాలని కోరారు. డిసెంబర్ 22వ తేదీన సర్ తుది జాబితాను ప్రచురించనున్నట్లు వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ ‘సర్’ సవరించిన షెడ్యూలు ప్రకారం తీసుకుంటున్న చర్యలు, కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్ల జాబితా రూపకల్పనకు సంబంధించిన అంశాలను వివరించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు..
కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి దోష రహిత ఓటర్ల జాబితా ప్రచురణకు కృషి చేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. డిసెంబర్ 23న ముసాయిదా జాబితా ప్రచురించిన అనంతరం ఆ రోజు నుంచి జనవరి 12 వరకు ఓటరు నమోదు దరఖాస్తులు, అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు తెలిపారు. వాటిని పరిష్కరించిన అనంతరం వచ్చే ఏడాది ఫిబ్రవరి 2న తుది జాబితాను ప్రచురించడం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పేరు నమోదుకు అర్హతలను కలెక్టర్ వివరించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన, నోటిఫై చేసిన ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే అర్హులైన ఉపాధ్యాయులను కూడా నిర్దేశిత ధ్రువీకరణ, సంబంధిత జిల్లా అధికారుల కౌంటర్ సంతకం ప్రక్రియకు లోబడి ఓటర్లుగా నమోదు చేయవచ్చన్నారు. వివరాలకు కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ కేంద్రం (91549 70454)లో సంప్రదించాలన్నారు. డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.


