జిల్లాలో మొత్తం 288 పంచాయతీలు, 3,088 వార్డులు మొత్తం 3,287 పోలింగ్ స్టేషన్లు తొలి దశలో 99 గ్రామ పంచాయతీలకు ఎన్నిక ఈ దశలో విజయవాడ, నందిగామ డివిజన్‌లోని రెండు మండలాలు రెండో దశలో తిరువూరు డివిజన్‌లో 89 గ్రామ పంచాయతీలు మూడో దశలో నందిగామ డివిజన్‌లోని 100 పంచాయతీలు
మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్..
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు స్వల్ప మార్పులతో షెడ్యూల్ దాదాపు ఖరారైంది. తొలుత జిల్లాలోని మూడు డివిజన్లలోని గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ రూపొందించారు. తొలి దశలో విజయవాడ, రెండో దశలో తిరువూరు, మూడో దశలో నందిగామ డివిజన్‌లోని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే నందిగామ డివిజన్‌లో పంచాయతీల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఎన్నికలకు ఏర్పాట్లు, పోలీసు సిబ్బంది, తదితర ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ స్వల్పమార్పులు సూచించారు. మూడో దశలో ఎన్నికల జరగాల్సిన నందిగామ డివిజన్‌లోని కంచికచర్ల, వీరులపాడు మండలాల్లోని గ్రామ పంచాయతీలకు తొలి దశలో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించారు. దీనికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నుంచి ఆమోదం లభించినట్లు తెలిసింది.
మూడు దశల్లో..
జిల్లాలో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. దీంతో గ్రామాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. నగరపాలక సంస్థలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కంటే ఈ ఎన్నికలను గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. గ్రామ పంచాయతీలు, వార్డులకు రిజర్వేషన్లు ఖరారవడంతో తొలి దశ ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో అక్కడక్కడ అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు.


