విజయవాడకు స్వచ్ఛతా పురస్కారం | - | Sakshi
Sakshi News home page

విజయవాడకు స్వచ్ఛతా పురస్కారం

Nov 12 2026 5:18 AM | Updated on Nov 12 2026 5:18 AM

గర్వకారణం..

పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరపాలక సంస్థకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2025–26లో మరోసారి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. బుధవారం సాయంత్రం న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖ మంత్రి డాక్టర్‌ పొంగూరు నారాయణ, ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌. సురేష్‌ కుమార్‌, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరాం, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ ధ్యానచంద్ర ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

అవార్డుల వివరాలు..

మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖ మంత్రి డాక్టర్‌ పొంగూరు నారాయణ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2025–26 పురస్కారాల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఆరు నగరాలు, పట్టణాలు వివిధ కేటగిరీల్లో అవార్డులు సాధించడం గర్వకారణమని తెలిపారు. ఇందులో విజయవాడకు జాతీయస్థాయిలో నేషనల్‌ క్లీన్‌ సిటీగా మూడో ర్యాంకు వచ్చిందని, విశాఖపట్నంకు 10 లక్షలు అంతకంటే ఎక్కువగా ఉన్న జనాభా కేటగిరీలో మొదటి ర్యాంకు వచ్చిందని, గుంటూరు 3 లక్షల నుంచి 10లక్షలు జనాభా కేటగిరిలో మూడో ర్యాంకు వచ్చిందన్నారు. తిరుపతి – కుప్పం నగరపాలక సంస్థలు స్వచ్ఛ షెహర్‌ జోడి కేటగిరీలో అవార్డులు సాధించగా, రాజమండ్రి నగరపాలక సంస్థ ఆంధ్రప్రదేశ్లో స్టేట్‌ ఫస్ట్‌ క్లీన్‌ సిటీ కేటగిరీలో పురస్కారం అందుకుందని పేర్కొన్నారు.

ప్రజా భాగస్వామ్యంతోనే..

మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌. సురేష్‌ కుమార్‌ మాట్లాడుతూ స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణ, వ్యర్థాల సమర్థ నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాల్లో రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న నిరంతర కార్యక్రమాలకు ఈ పురస్కారాలు నిదర్శనమని తెలిపారు.

నేషనల్‌ క్లీన్‌ సిటీ విభాగంలో అవార్డు

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ ధ్యానచంద్ర హెచ్‌ఎం మాట్లాడుతూ విజయవాడ నేషనల్‌ క్లీన్‌ సిటీలో మూడో ర్యాంకు సాధించటం ఎంతో గర్వకారణమన్నారు. అదనపు కమిషనర్‌ (ప్రాజెక్ట్‌) డాక్టర్‌ డి.చంద్రశేఖర్‌, చీఫ్‌ మెడికల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సీహెచ్‌ నిర్మల గ్లోరీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement