ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కార్తిక శుద్ధ విదియ (భగిని హస్త భోజనం), యమ ద్వితీయను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ వారికి గాజుల ఉత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారి మూల విరాట్‌తో పాటు ఆలయ ప్రాంగణం, ఉపాలయాలు, నూతన పూజా మండపంలోని ఉత్సవమూర్తిని గాజులతో విశేషంగా అలంకరించారు. ఘాట్ రోడ్డులోని కామథేను అమ్మవారికి సప్త వర్ణాలతో మెరిసిపోతున్న గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించగా వాహనాల్లో ప్రయాణిస్తున్న యాత్రికులు సైతం అమ్మవారి ఆలయం ఎదుట తమ వాహనాలను నిలిపి అమ్మవారిని దర్శించుకోవడం కనిపించింది. పెద్ద, మీడియం, చిన్న సైజు గాజులతో చేసిన అలంకారంలో అమ్మవారి రూపం ముగ్ధ మనోహరంగా ఉందని భక్తులు పేర్కొన్నారు. తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, వస్త్రాలంకరణ సేవ, ఖడ్గమాలార్చన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. అమ్మవారిని ఆలయ ఈవో శీనానాయక్ దంపతులు, ఆలయ అధికారులు దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ఉత్సవానికి సుమారు 8 లక్షల మేర గాజులను వినియోగించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. దాతలు, భక్తులు, ట్రస్ట్ బోర్డు సభ్యుల ద్వారా గాజులను సేకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు పూజా సామగ్రితో పాటు గాజులను సమర్పించడం కనిపించింది. ఆలయ ప్రాంగణంలో ముత్తయిదువులు గాజు లు, పసుపు, కుంకుమను ఇచ్చి పుచ్చుకున్నారు.
రద్దీ సాధారణం..
దుర్గమ్మకు గాజుల ఉత్సవం నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి విచ్చేస్తారని ఆలయ అధికారులు అంచనా వేశారు. అయితే ఉదయం నుంచి భక్తుల రద్దీ సాధారణంగానే కొనసాగింది. అమ్మవారి మహా నివేదన సమయంలో సుమారు అరగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేశారు. అయినా సరే ఆలయ ప్రాంగణంలో రద్దీ సాధారణంగానే కొనసాగింది. సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారి పంచహారతుల సేవ అనంతరం కొద్దిగా రద్దీ కనిపించింది.


