టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలో చేరికలు | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలో చేరికలు

Oct 26 2026 7:54 AM | Updated on Oct 26 2026 7:54 AM

టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలో చేరికలు అండర్‌–19 జిల్లా బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలు దాడి, బెదిరించిన వ్యక్తిపై కేసు టిప్పర్‌ను ఢీకొన్న కారు

పాయకాపురం(విజయవాడరూరల్‌): కార్పొరేషన్‌ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ నుంచి 11 మంది కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌ సీపీలోకి చేరారు. ఆదివారం రాజీవ్‌నగర్‌లోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయం లో పార్టీ నేతలు అంగిరేకుల నాగేశ్వరరావు, 85వ డివిజన్‌ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిని అంగిరేకుల గొల్లభామ, క్లస్టర్‌ ఇన్‌చార్జి పసుపులేటి ఏసు వారికి పార్టీ కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టి.చంద్రశేఖర్‌, టి.బుజ్జి, వి.శ్రీను, బి.తవ్టీస్‌, కె.వెంకటేశ్వరరావు, ఎన్‌.సూర్‌రెడ్డి, బి.నాగు, వి.రాజు, బాలు, టి.భాస్కరరావు, టి.దుర్గారావు టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలోకి చేరారు. పార్టీ అభివృద్ధికి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని పసుపులేటి ఏసు వారికి సూచించారు.

పెదకళ్లేపల్లి(మోపిదేవి): మండల పరిధిలోని పెదకళ్లేపల్లి జెడ్పీ పాఠశాల ఆవరణలో ఆదివారం అండర్‌–19 జిల్లా స్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహించారు. పోటీల్లో బాలికల విభాగంలో మచిలీపట్నం సౌత్‌ జట్టు ప్రథమ స్థానం సాధించగా, మచిలీపట్నం నార్త్‌ జట్టు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు ఎంపిక కమిటీ అధ్యక్షుడు వి.వెంకటేశ్వరావు తెలిపారు. బాలుర విభాగంలో విజయవాడ జట్టు మొదటి స్థానం సాధించగా, పెడన ద్వితీయ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. పోటీల్లో క్రీడాకారులు ప్రదర్శించిన ప్రతిభ, నైపుణ్యాల ఆధారంగా జిల్లా స్థాయి జట్లకు క్రీడాకారులను ఎంపిక చేసినట్లు కమిటీ నిర్వాహకులు వివరించారు. పోటీల్లో ఎంపిక కమిటీ సెక్రటరీ శివశంకర్‌, కన్వీనర్‌ మోహనరావు, సభ్యులు కె.రాజేంద్రబాబు, ఎం.చెన్నకేశవ, యు.అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

కంచికచర్ల: ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన సందర్భంగా దాడి, బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పి. శంకరరావు ఆదివారం తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం కంచికచర్ల మండల పరిషత్‌ అధికారి కార్యాలయంలో ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం సమయంలో ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన జరుగుతున్న సందర్భమది. అప్పుడు కంచికచర్ల 6వ ఎంపీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన చింతమాల నవీన్‌ అంబేద్కర్‌ తరఫున అభ్యంతరం తెలియజేయడానికి వెళ్లిన బర్రె శ్రీనివాసరావుపై బర్రె ఉదయ్‌కిరణ్‌ అనే వ్యక్తి దాడిచేసి దూషిస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు అందిందన్నారు. ఘటనపై బాదితుడు శ్రీనివాసరావు ఈనెల 25న ఫిర్యాదు చేశారని ఫిర్యాదు మేరకు ఉదయ్‌కిరణ్‌పై క్రైం నంబర్‌ 302 /2026 భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌) 126(2), 131,351(2) సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.

మహిళ మృతి

పామర్రు: టిప్పర్‌ను కారు ఢీకొన్న ఘటనలో మహిళ మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పామర్రు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఓర్సు ఆదినారాయణ, తన తల్లి ఓర్సు చిన్న తిరుపతమ్మ(55), దుండగుల నాగమణి, కోట నరేష్‌, గోపీకృష్ణలతో కలిసి ఏపీ03సీఎఫ్‌5149 నంబరు కారులో అర్ధరాత్రి వేళ మోపిదేవి గ్రామానికి బయలుదేరారు. మార్గ మధ్యలో సుమారు అర్ధరాత్రి 2 గంటల సమయంలో పామర్రు, గుడివాడ ఫ్లైఓవర్‌ వద్దకు కారు చేరుకుంది. ఆ సమయంలో విజయవాడ నుంచి మచిలీపట్నం వైపు వెళ్తున్న ఏపీ25వై5208 నంబరు టిప్పర్‌ లారీ అకస్మాత్తుగా ఆగింది. దీంతో కారు.. టిప్పర్‌ లారీని ఢీ కొట్టింది. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఓర్సు చిన్న తిరుపతమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న నలుగురు ప్రయాణికులు గాయపడగా వారిని వెంటనే మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పామర్రు ఎస్‌ఐ కూచిపూడి శ్రీనివాస్‌ హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను నమోదు చేసి సహాయ చర్యలు తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement