రాళ్ల కింద చితికిపోతున్న బతుకులు సమస్యల సుడిలో కొండ ప్రాంత వాసులు అబద్ధపు హామీలతో కాలం వెళ్లదీస్తున్న కూటమి నాయకులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): కొండ ప్రాంత ప్రజలు సమస్యల వలయంలో బిక్కు బిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో కొండ ప్రాంత ప్రజల సమస్యలను గాలికొదిలేసింది. దీంతో భారీ వర్షాలు పడినప్పుడు కొండ చరియలు జారి పడి ఆ రాళ్ల కింద బడుగుల బతుకులు చితికిపోతున్నాయి. అయినప్పటికీ పాలకుల్లో చలనం రావడం లేదు. రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, మంచినీటి సమస్యలు ఎక్కడికక్కడ తిష్ట వేసుకు కూర్చున్నాయి. కొండ ప్రాంతాల్లో అభివృద్ధి ఊసే ఎత్తడం లేదు. మంచినీరు, మెట్ల మార్గాలు, డ్రైనేజీ, విద్యుత్, వీధి లైట్లు వంటి అనేక సమస్యలతో సహజీవనం సాగిస్తున్నారు.
పాలకుల నిర్లక్ష్యమే కారణం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఆగస్టు 31న వచ్చిన భారీ వర్షాలకు సున్నపు బట్టీల సెంటర్‌లో కొండరాళ్లు జారి ఓ ఇంటిపై పడ్డాయి. దీంతో ఐదు ప్రాణాలు రాళ్ల కింద చితికిపోయాయి. వారిలో ఎంతో భవిష్యత్తు ఉన్న హోట ల్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు కూడా ఉన్నారు. భారీ వర్షం వస్తుందని తెలిసినా పాలకులు ముందుగా ఎలాంటి హెచ్చరికలు చేయకపోవడమే ఇందుకు కారణం. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోంది.
మధ్యలో నిలిచిన రిటైనింగ్ వాల్ పనులు
గులాం మొహిద్దీన్ నగర్‌లో రెండు వేల మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ మెట్ల మార్గం ఎదురుగా ఉన్న ప్రాంతం ప్రమాదకరంగా ఉండటంలో గత ప్రభుత్వంలో రూ.16 లక్షలు కేటాయించి రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టారు. ఆ వాల్ నిర్మాణం సగం పూర్తయిన తర్వాత నిలిపివేయడంతో ఆ ప్రాంతంలో ప్రమాదకరంగా మారింది. ప్రజలు ఏ మాత్రం గమనించక పోయినా కొండపై నుంచి పడిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


