మధురానగర్(విజయవాడసెంట్రల్): ప్రతి చిన్నారికీ క్రమం తప్పకుండా పోలియో చుక్కలు వేయించి దేశాన్ని పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ట్రాఫిక్ డీసీపీ ఎస్.కె. షరీన్ బేగం అన్నారు. స్థానిక బీఆర్టీఎస్ రోడ్డులో శనివారం ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్‌టౌన్ సహకారంతో ‘పోలియో అవేర్‌నెస్ వాకథాన్ 2026’ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని రోటరీ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ రొటేరియన్ గుత్తికొండ శ్రీరామ్‌తో కలిసి వాక్‌థాన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజం నుంచి పోలియోను పూర్తిగా పారదోలడానికి రోటరీ ఇంటర్నేషనల్ చేస్తున్న కృషిని కొనియాడారు. ఎండ్ పోలియో నౌ’ అనే నినాదంతో ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించి, భవిష్యత్ తరాలను సురక్షితంగా ఉంచాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విశిష్ట అతిథి ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎ.శ్రవణ్ బాబు మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్, గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ ఇనిషియేటివ్ వంటి సంస్థల విశేష కృషితో భారతదేశంలో 2011 నుంచి ఇప్పటివరకు ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ప్రెసిడెంట్ రవిప్రకాష్ సోమయాజుల, సెక్రటరీ రామకృష్ణ ఉప్పలపాటి, యడ్ల పార్థసారథి, వెంకట్ కేతిబోయిన, త్రినాథ్ నండూరి తదితరులు పాల్గొని మాట్లాడారు.


