ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాల అనంతరం ఇంద్రకీలాద్రిపై శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాధారణ పరిస్థితులు కనిపించాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 11 గంటల వరకు భక్తులు, భవానీల రద్దీ అధికంగా కనిపించింది. భవానీల రద్దీకి తోడు శుక్రవారం రద్దీ తోడు కావడంతో అమ్మవారి దర్శనానికి గంట లోపు సమయం పట్టింది. మరో వైపున దసరా ఉత్సవాలకు సొంత గ్రామాలు, పట్టణాలకు విచ్చేసిన వారు తిరుగు ప్రయాణంలో ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారిని దర్శించుకోవడం కనిపించింది. భక్తుల రద్దీ సాదారణంగా ఉండటంతో ఘాట్‌రోడ్డు మీదగా కొండపైకి అనుమతించారు. శనివారం నుంచి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు యథాతథంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో శీనానాయక్ తెలిపారు. తెల్లవారుజామున అమ్మవారికి నిర్వహించే ఖడ్గమాలార్చన, ఉదయం 8 గంటలకు శ్రీచక్రనవార్చన, చండీహోమం, ప్రత్యేక కుంకుమార్చనలతో పాటు సాయంత్రం అమ్మవారికి పంచహారతుల సేవలు జరుగుతాయన్నారు. సేవలతో పాటు అమ్మవారి అంతరాలయ దర్శనం, రూ.100, రూ.300 టికెట్లపై దర్శనాలు కూడా అనుమతిస్తామన్నారు.


