మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఈనెల 25వ తేదీ ఆదివారం విజయవాడ బీఆర్‌టీఎస్ రోడ్డులోని శారదా కళాశాల ఆవరణలో ఎన్టీఆర్ జిల్లా ఓపెన్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి పి.రేణుక శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టోర్నమెంట్‌లో ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా కృష్ణాజిల్లాలోని చెస్ క్రీడాకారులు కూడా పాల్గొనవచ్చునని తెలియజేశారు. ఈ టోర్నమెంట్ శారదా కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో జరుగుతుందని, విజేతలకు నగదు బహుమతులను అందజేస్తారని తెలిపారు. బాలబాలికలను వయస్సుల వారీగా విభాగాలు చేసి వారికి వేర్వేరుగా పోటీలను నిర్వహిస్తారని వివరించారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆదివారం ఉదయం 8.30 గంటల లోగా టోర్నమెంట్ జరిగే ప్రదేశానికి స్వయంగా వచ్చి రిపోర్ట్ చేయాల్సిందిగా పేర్కొన్నారు. వివరాలకు 97007 75220 నంబరులో సంప్రదించాల్సిందిగా ఆమె కోరారు.
ఎ.కొండూరు: మండలంలోని గోపాలపురం గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. విజయవాడ నుంచి భద్రాచలం వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు కంభంపాడు వైపు నుంచి గోపాలపురం వెళ్తున్న మోపెడ్‌ను వెనుకనుంచి వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో మోపెడ్‌పై వెళ్తున్న మాళావతు భధ్య (55)తీవ్ర గాయాలపాలై విపరీతంగా రక్తస్రావం కావడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గన్నవరం: మండలంలోని సూరంపల్లిలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటనపై శుక్రవారం గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం... పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా మున్సిటోలా గ్రామానికి చెందిన జాగిర్ అలీ(19) కొంతకాలంగా సూరంపల్లిలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. జాగిర్ అలీ ఓ యువతి పరస్పరం ప్రేమించుకోవడంతో పాటు పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారు. అయితే ఇద్దరిదీ చిన్న వయస్సు కావడంతో పెళ్లి చేసుకునేందుకు కొంత కాలం వేచి ఉండాలని కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో అతను మనస్తాపానికి గురై గురువారం బాత్‌రూమ్‌లో ఉరివేసుకున్నాడు. తోటి కార్మికులు గుర్తించి కిందకు దించి చూడగా అప్పటికే అతను మృతిచెందాడు. మృతుడి బంధువు తోహిత్ ఆలం ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గుణదల(విజయవాడ తూర్పు): పార్టీ నియమాలను ఉల్లంఘిస్తూ కార్పొరేషన్ ఎన్నికల వ్యవహారంలో ఇష్టానుసారంగా ప్రవర్తించిన ఇద్దరు నాయకులను తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. సేకరించిన వివరాల ప్రకారం, గుణదల 1వ డివిజన్‌లో టీడీపీకి చెందిన కొమ్మినేని సురేష్, మాదాల సత్యవతి ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశంపార్టీకి సేవలందించారు. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ వీరిద్దరికీ సముచిత స్థానం ఇవ్వలేదన్న కారణంగా వారు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులను దూషిస్తూ, పార్టీ నియమాలను అతిక్రమించారు. దీంతో విషయం తెలుసుకున్న సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వారిద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై టీడీపీలో వీరిద్దరికీ స్థానం లేదని, పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకోకూడదని, సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ సెంట్రల్ కార్యాలయం అధికారికంగా లేఖను విడుదల చేసింది. ఎంతో కాలంగా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన తమను సస్పెండ్ చేయడంపై వారిద్దరూ తీవ్ర అసహనానికి గురయ్యారు. తమకు అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
నిత్యాన్నదానానికి వితరణ
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో నిత్యాన్నదాన పథకానికి విజయవాడ వాస్తవ్యులు చినమూరి సదాశివరెడ్డి రూ.50 వేలు విరాళంగా సమర్పించుకున్నారు. ఉదయం ఆలయానికి వచ్చి స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావుకు విరాళం అందజేశారు.


