గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మునిసిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మేయర్, మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామ, కొండపల్లి మునిసిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్ల ఘట్టం పూర్తికావడంతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. డివిజన్లు, వార్డుల్లో ఉదయం, సాయంత్రం పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.
విజయవాడ నగర పాలక సంస్థలో...
వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 32, 35, 36, 37 డివిజన్లలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నగరంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనకు, ప్రస్తుత కూటమి పాలనకు తేడా గమనించాలని కోరారు. తాను మేయర్‌గా గత ఐదేళ్లలో ఆయా డివిజన్లలో చేసిన అభివృద్ధిని వివరించారు. కూటమి వైఫల్యాలను ఎండగట్టారు.
జగ్గయ్యపేట మునిసిపాలిటీలో...
జగ్గయ్యపేట పట్టణంలో మున్సిపల్ చైర్‌పర్సన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షేక్ హఫీజున్నీసా 35వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కౌన్సిలర్ అభ్యర్థి దార్ల ప్రసన్నకుమార్, నియోజకవర్గ ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు సతీమణి సుధారాణితో కలిసి వార్డులో ఇంటింటికీ ప్రచారం చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏ విధంగా విస్మరించింది వివరిస్తూ ప్రచారం చేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
కొండపల్లి మునిసిపాలిటీలో...
కొండపల్లి మున్సిపాలిటీలో వైఎస్సార్ సీపీ చైర్ పర్సన్ అభ్యర్థి నల్లమోతు తేజస్వి 29, 30, 32వ వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రి జోగి రమేష్, ఆయా వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు వెంకటేష్, కన్నెకంటి పద్మ, కారుమంచి లవకుమార్ ప్రచారంలో పాల్గొన్నారు. పథకాల అమలులో నిర్లక్ష్యం, ధరల పెరుగుదల వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రచారంలో దూసుకెళుతున్నారు.
నందిగామ మునిసిపాలిటీలో...
నందిగామ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి చల్లా బ్రహ్మేశ్వరరావు పట్టణంలోని 19, 20, 21, 22 వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ షేక్ మస్తాన్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం ముమ్మరం చేశారు.
తిరువూరు మునిసిపాలిటీలో...
తిరువూరు పట్టణంలోని 18వ వార్డులో చైర్మన్ అభ్యర్థి పరసా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం చేశారు. ప్రచార సమయంలో స్థానికులు తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఆయనకు వివరించారు. ప్రచారంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.


