గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియను శుక్రవారం కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆకస్మికంగా పరిశీలించారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడే అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియ, హెల్ప్ డెస్క్‌లు, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా ప్రతి కేంద్రం వద్ద నిరంతర వీడియోగ్రఫీ పర్యవేక్షణను ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే మార్గదర్శనం చేసేందుకు ప్రతి కేంద్రం వద్ద ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ సదుపాయాన్ని అందుబాటులో ఉంచామని చెప్పారు. ఎవరైనా నామినేషన్ల దాఖలుకు వెళ్లే అభ్యర్థులను అడ్డుకున్నా లేదా ఇబ్బందులకు గురిచేసినా వెంటనే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 91549 70454, పోలీస్ కంట్రోల్ రూమ్ లేదా సంబంధిత రిటర్నింగ్ అధికారుల దృష్టికి తేవాలన్నారు. అడ్డంకులు సృష్టించే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నిఘా...
ఓటర్లు తమ ఓటు హక్కును సౌకర్యవంతంగా వినియోగించుకునేలా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాలలో నిర్దేశిత కనీస వసతులైన తాగునీరు, విద్యుత్, షామియానా, ర్యాంప్ వంటి అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. గత ఎన్నికల పరిస్థితులను పరిశీలించి సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అక్కడ అదనపు పోలీసు బలగాల మోహరింపు, సీసీటీవీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ద్వారా నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం కౌంటింగ్ కేంద్రాల వద్ద విస్తృత భద్రతా ఏర్పాట్లతో పాటు అవసరమైన అన్ని సదుపాయాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తూ.చ తప్పక పాటించాలని, ఎన్నికలు విజయవంతంగా ముగిసేందుకు ప్రజలు, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ కోరారు.
కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి
డాక్టర్ జి.లక్ష్మీశ


