లడ్డూ ప్రసాదాలు అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం భవానీలకు అందుబాటులో లేని లడ్డూలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: దసరా ఉత్సవాలకు విచ్చేసే భక్తులు, భవానీలకు లడ్డూ ప్రసాదాలను అందజేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. దేవస్థాన అధికారుల నిర్లక్ష్యంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారి కోసం 55 నుంచి 60 లక్షల లడ్డూలు తయారు చేసి కోరినన్ని లడ్డూలను అందిస్తామని దుర్గగుడి ఈవో, చైర్మన్ పదేపదే చెబుతూ వచ్చారు. గత ఏడాది దసరా ఉత్సావాలలో 45 లక్షల లడ్డూలను విక్రయించారు. ఈసారి పది నుంచి 15 లక్షల లడ్డూలు అదనంగా అందిస్తామని చెప్పారు. అయితే ఉత్సవాల చివరి రెండు రోజులు లడ్డూలను అందించలేకపోయారు. వాస్తవానికి గతేడాది తయారు చేసిన లడ్డూల కన్నా ఈ ఏడాది తయారు చేసిన లడ్డూల సంఖ్య తక్కువగా కనిపిస్తోంది. అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల ఈ ఏడాది లడ్డూ తయారీలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. అధికారికంగా ఇప్పటివరకూ దేవస్థానం ఇచ్చిన లెక్క కూడా 35 లక్షలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు దేవస్థానం వద్ద మూడు లక్షల లోపు లడ్డూలే ఉన్నాయి. దీంతో వచ్చే రెండు రోజుల పాటు వచ్చే భవానీలకు అడిగినన్ని లడ్డూలు అందించే పరిస్థితి లేకుండా పోయింది.
కమిషనర్ ఆదేశాలతోనే ఆలస్యం..
దసరా ఉత్సవాలకు కొద్ది రోజుల ముందు నూతన లడ్డూ పోటు ప్రారంభించారు. ఆ లడ్డూ పోటులోనే ఈ ఏడాది లడ్డూలను తయారు చేసి భవానీలకు, భక్తులకు అందించాలని దేవదాయశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే నూతన లడ్డూపోటులో లడ్డూ బూందీ తయారీకి ఎటువంటి పొయ్యిల ఏర్పాటు అప్పటికి జరగలేదు. కమిషనర్ ఆదేశాలతో హుటాహుటిన లడ్డూపోటుకు వంటశాలను సిద్ధం చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన ఆలస్యం జరిగిపోయింది. తొలుత బుద్దా వారి ఆలయం వెనుక ఉన్న లడ్డూపోటులో తయారీకి ససేమిరా అన్న కమిషనర్‌కు పరిస్థితిని వివరించడంతో చివరి నిమిషంలో లడ్డూ తయారీకి అంగీకారం తెలిపారు. ఏటా ఉత్సవాలకు రెండు, మూడు రోజుల ముందు నుంచే లడ్డూ తయారీ ప్రారంభిస్తారు. ఈ ఏడాది కేవలం బుద్దా వారి ఆలయం వెనుక ఉన్న లడ్డూపోటులో మాత్రమే లడ్డూ తయారైంది.
ఏనుగు షెడ్డు వినియోగిస్తే సమస్య తలెత్తేనా?
కనకదుర్గనగర్ సమీపంలోని దేవస్థానానికి చెందిన ఏనుగు షెడ్డులో ఈ ఏడాది లడ్డూ తయారీని నిలిపేశారు. ఈ షెడ్డును గోడౌన్‌గా వినియోగించారు. ఏటా ఈ షెడ్డులో రోజుకు రెండు లక్షల మేర లడ్డూలు తయారయ్యేవి. ఈ ఏడాది ఈ షెడ్డులో లడ్డూ తయారీకి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ తొలి నుంచీ చెబుతూ వచ్చారు. దీంతో భక్తులకు ప్రసాదాలను అందించలేకపోయారన్నది వాస్తవం.
గంటల తరబడి ఎదురుచూపులు..
శ్రీరాజరాజేశ్వరి అలంకారం నుంచి లడ్డూల కొరత సృష్టంగా కనిపించింది. ప్రసాదాల కోసం భవానీలు గంటల తరబడి క్యూలైన్‌లో వేచి ఉండాల్సి వచ్చింది. ఒక్కొక్కరికీ ఒకటి, రెండు బాక్సులు మాత్రమే ఇస్తుండటంతో బృందంగా వచ్చిన భక్తులందరూ ప్రసాదాల కోసం క్యూలైన్‌లో నిల్చోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు లడ్డూ ప్రసాదాల కోసం వేచి ఉన్న భక్తుల క్యూ ప్రసాదాల కౌంటర్ షెడ్డును దాటి కనకదుర్గనగర్ వరకు చేరింది. అయితే, భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసి ఆలయ పోటు విభాగంలో నిరంతరాయంగా లడ్డూలు తయారు చేసి నిల్వలు ఉంచడం వల్ల మంగళవారం సాయంత్రం వరకు భక్తులందరికీ కోరినన్ని లడ్డూ ప్రసాదాలు అందించగలిగామని, ప్రసాదం తయారీ కొనసాగుతుందని ఈవో శీనానాయక్ చెబుతున్నారు.


