మేయర్‌ రేసులో 19 మంది | - | Sakshi
Sakshi News home page

మేయర్‌ రేసులో 19 మంది

Oct 22 2026 4:02 AM | Updated on Oct 22 2026 4:02 AM

మేయర్‌ రేసులో 19 మంది రైలులో గంజాయి తరలిస్తున్న యువకుడి అరెస్టు పారా గేమ్స్‌ కాంస్య పతకం విజేతకు అభినందనలు బావిలో పడిన యువకుడి మృతదేహం లభ్యం బాణసంచా పేలి నలుగురు చిన్నారులకు గాయాలు

పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం బుధవారం ముగిసింది. వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ రూంలో ఏర్పాటు చేసిన ఆర్వో కేంద్రంలో ఈ నెల 16, 17, 18 తేదీల్లో నామినేషన్లు స్వీకరించారు. స్క్రూటినీ అనంతరం మేయర్‌ ఎన్నికలకు 21 మందిని అర్హులుగా గుర్తించగా, ఇద్దరు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో 19 మంది మేయర్‌ ఎన్నికల రేసులో మిగిలారు. వారికి బుధవారం సాయంత్రం ఆర్వో రజినీ బ్యాలెట్‌ పేపరులో ఆర్డర్‌ను బట్టి గుర్తులు కేటాయించారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి, మాజీ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మికి ఫ్యాన్‌ గుర్తును మూడో నంబరు గుర్తుగా కేటాయించారు. ఎన్నికల కమిషన్‌ గుర్తించిన, రిజిస్టర్‌ అయిన జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. 11 మంది స్వతంత్ర అభ్యర్థులకు గ్యాస్‌ సిలిండర్‌, గౌను, కత్తెర, ఉంగరం, బ్యాట్‌, కుట్టుమిషన్‌, గ్యాస్‌పొయ్యి, కుండ, బీరువా, ఎయిర్‌ కండీషనర్‌ వంటి గుర్తులను కేటాయించారు. నగరంలోని మూడు సర్కిళ్ల పరిధిలోని 86 డివిజన్లకు 475 మంది కార్పొరేటర్‌ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించకున్నారు.

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): రైలులో గంజాయి తరలిస్తున్న యువకుడిని విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) అరెస్టు చేసి, 9.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో జీఆర్‌పీ పోలీసులు విజయవాడ రైల్వేస్టేషన్‌లోని ఒకటో నంబరు ప్లాట్‌ఫాంలో ఆగిన ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ జనరల్‌ కోచ్‌లో సాధారణ తనిఖీలు చేపట్టారు. ఒక యువకుడు లగేజీ బ్యాగుతో పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని, సోదా చేయగా బ్యాగులో మూడు బండిళ్లలో 9.5 కిలోల గంజాయి దొరికింది. నిందితుడిని కర్నాటక రాష్ట్రం, కలహాలి గ్రామానికి చెందిన ఎం. మంజునాథ (27)గా గుర్తించారు. అతను విశాఖ పట్నం పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు గంజాయి కొని బెంగళూరులో అధిక ధరకు విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో మంగళవారం 9.5 కిలోల గంజాయి కొనుగోలు చేసి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ జనరల్‌ కోచ్‌లో బెంగళూరుకు టికెట్‌ లేకుండా ప్రయాణిస్తూ జీఆర్‌పీ పోలీసుల తనిఖీల్లో పట్టుపడ్డాడు. అతని వద్ద గంజాయి స్వాధీనం చేసుకుని, అరెస్టు చేశారు.

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జపాన్‌లోని ఐచి–నగోయాలో జరుగుతున్న ఆసియా పారా గేమ్స్‌– 2026లో షాట్‌పుట్‌ (ఎఫ్‌–40 విభాగం)లో రాష్ట్రానికి చెందిన రొంగాలి రవి కాంస్య పతకం సాధించడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) చైర్మన్‌ రవి నాయుడు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రీడా వేదికపై సత్తాచాటి పతకాన్ని అందించిన రవికి అభినందనలు తెలిపారు. అతని కఠోర శ్రమ, పట్టుదల, అంకితభావం ఎంతోమంది క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. రవి భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తి తో మరిన్ని విజయాలు సాధించి, అంతర్జాతీయ స్థాయిలో దేశానికి, రాష్ట్రానికి మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

పెనుగంచిప్రోలు: మండలంలోని లింగగూడెం రోడ్డులో సోమవారం వ్యవసాయ బావిలో పడిన గ్రామానికి చెంది షేక్‌ గఫూర్‌ మృతదేహం మంగళవారం మధ్యాహ్నం లభించింది. బావిలో నీరు ఎక్కువగా ఉండటం, మట్టితో పూడిపోవటంతో మోటార్లతో నీటి తోడించిన అనంతరం రెండో రోజు మృతదేహాన్ని ఈతగాళ్లు బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టమ్‌ నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి జాన్‌బీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అర్జున్‌ తెలిపారు. పోస్టుమార్టమ్‌ అనంతరం మృతికి గత కారణాలు తెలుస్తాయన్నారు.

జగ్గయ్యపేట: మండలంలోని బూదవాడ గ్రామంలో జరిగిన శ్రీ దేవీ శరన్నవరాత్రి వేడుకల్లో మంగళవారం రాత్రి అపశృతి చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రధాన సెంటరులో నవరాత్రులు సందర్భంగా నిర్వాహకులు అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విజయదశమి పండుగ సంద ర్భంగా మంగళవారం రాత్రి అమ్మవారి విగ్రహాన్ని గ్రామంలో ప్రత్యేక ట్రాక్టర్‌పై ఊరేగించారు. ఈ క్రమంలో ట్రాక్టర్‌లో బాణసంచా ఉంచారు. అదే ట్రాక్టర్‌పై చిన్నారులు ఉన్నారు. టపాసులు కాలుస్తుండగా నిప్పురవ్వలు పడి ట్రాక్టర్‌లోని బాణసంచా పేలి నలుగురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement