వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న దసరా మహోత్సవాల్లో భాగంగా శమీపూజను వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అర్ధరాత్రి శాస్త్రోక్తంగా నిర్వహించారు. దుర్గమ్మ శమీపూజను వన్‌టౌన్ హౌస్ ఆఫీసర్ దంపతులు నిర్వహించటం ఆనవాయితీ. హంస వాహనంపై గంగ, పార్వతి (దుర్గ) సమేత మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు ఆలయం నుంచి బయలుదేరి జమ్మిదొడ్డికి చేరుకుంది. అక్కడ సీఐ గుణరాము దంపతులు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తులు ఊరేగింపుగా పాతబస్తీ ప్రధాన వీధుల మీదుగా సాగుతూ వన్‌టౌన్ పీఎస్‌కు చేరుకున్నారు. సీఐ దంపతులు శ్రీ దుర్గామల్లేశ్వర్లు మూర్తులకు స్వాగతం పలికి స్టేషన్ ప్రాంగణానికి తీసుకువెళ్లారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఊరేగింపు బుధవారం ఉదయం ఆలయానికి చేరుకుంది. పోలీసు అధికారులు కుటుంబ సభ్యులతో కలిసి ఈ పూజల్లో పాల్గొన్నారు.
లోకో పైలెట్ సురేష్‌కు జీఎం సేఫ్టీ అవార్డు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించి రానున్న ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి సురక్షిత రైళ్ల నిర్వహణకు కృషి చేసిన విజయవాడ డివిజన్ రాజమండ్రి గూడ్స్ లోకో పైలెట్ టి.సురేష్ ప్రతిష్టాత్మక ‘జీఎం మ్యాన్ ఆఫ్ ది మంత్ సేఫ్టీ అవార్డు’ అందుకున్నారు. విశాఖపట్నంలోని జోనల్ హెడ్ క్వార్టర్స్ బుధవారం అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్ మాధుర్ చేతుల సురేష్ అవార్డు స్వీకరించారు. సెప్టెంబర్ 28న సురేష్ విధుల్లో ఉండగా పక్క ట్రాక్‌పై వెళ్తున్న ఒక గూడ్స్ రైలులోని వ్యాగన్ యాక్సిల్ బాక్స్ నుంచి భారీగా మంటలు రావటాన్ని గుర్తించారు. వెంటనే స్పందించి వాకీటాకీ ద్వారా పక్క రైలులోని లోకోపైలెట్లు, ట్రైన్ మేనేజర్లను అప్రమత్తం చేశారు. వారు తక్షణం రైలును నిలిపి మంటలను అదుపు చేశారు. అనంతరం గుణదల రైల్వేస్టేషన్‌లో చక్రం మార్చేందుకు వ్యాగన్‌ను వేరు చేశారు. రైలు భద్రతపై సురేష్ చూసిన అప్రమత్తతకు జీఎం సేఫ్టీ అవార్డును అందజేసి అభినందించారు.


