● వివిధ శాఖల పేరు చెప్పుకుని దర్జాగా దర్శనాలు ● సామాన్యులకు తప్పని పాట్లు ● ఇష్టానుసారంగా కొండపైకి ద్విచక్ర వాహనాలు, కార్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు కీలక దశకు చేరుకున్నాయి. దసరా ఉత్సవాలలో ప్రధానంగా మూలా నక్షత్రం రోజు సాఫీగా గడిచిందంటే ఉత్సవాలు విజయవంతం అయినట్లేనని అన్ని ప్రభుత్వ శాఖలు భావిస్తాయి. అయితే శనివారం అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. శనివారం తెల్లవారుజాము నుంచి సామాన్య భక్తులకు తోడు ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులతో పాటు భవానీల తాకిడి పెరిగింది. భక్తుల రద్దీ అధికంగా ఉండటం, క్యూలైన్లో నుంచి కాకుండా విడిగా ఘాట్రోడ్డులో నుంచి వచ్చే వారి సంఖ్య అధికంగా కనిపించింది. అనధికార దర్శనాలను కట్టడి చేయడంలో అన్ని ప్రభుత్వ శాఖలు విఫలమయ్యాయి. సిఫార్సులు ఉన్న వారు దర్జాగా కార్లలో డోనర్ సెల్ వరకు చేరుకోవడం, పోలీసు శాఖ సిబ్బంది దర్జాగా ద్విచక్ర వాహనాలు, కార్లపై ఘాట్రోడ్డు మీదగా ఆలయానికి చేరుకుని అమ్మవారి దర్శనాలు చేసుకోవడం కనిపించింది. దీంతో క్యూలైన్లో గంటల తరబడి వేచి ఉన్న భక్తులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. క్యూలైన్లకు సమీపంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపించింది. ముఖ్యంగా ఓం టర్నింగ్, డోనర్ సెల్, లక్ష్మీగణపతి ఫుట్ బ్రిడ్జి, చిన్న గాలిగోపురం వద్ద సిఫార్సులతో విచ్చేసిన వారు గుంపులు, గుంపులుగా చేరిపోతున్నారు. దీంతో ఎక్కడ తొక్కిసలాట జరుగుతుందోననే ఆందోళనతో గేట్లను తీయడం, మళ్లీ కొంత సమయానికి రద్దీ పెరిగిపోవడం కనిపించింది. వెస్ట్ నుంచి ఏసీపీగా బదిలీ అయిన దుర్గారావు స్వయంగా సర్వ దర్శనం క్యూలైన్లోకి వెళ్లి రద్దీని నియంత్రించారు. ఓ దశలో ఆయనకు కూడా అది సాధ్యం కాకపోవడంతో ఐదుగురు సిబ్బంది సహకారం తీసుకుని క్యూలైన్లను క్రమబద్ధీకరించారు. మధ్యాహ్నం డోనర్ సెల్ వద్ద ఇదే తరహాలో భక్తుల రద్దీ పెరిగిపోవడం, వారి మధ్యలో చంటిపిల్లలు, వృద్ధులు, వికలాంగులు చిక్కుకుపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ నాలుగు పాయింట్ల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే పరిస్థితి నెలకొనడంతో భక్తులు ఆవేదన వర్ణనాతీతం. ఓం టర్నింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులు ఇష్టానుసారంగా భక్తులను వదిలేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని పోలీసు అధికారులు బహిరంగంగా పేర్కొంటున్నారు. అయితే పోలీసు సిబ్బంది ఎవరు వచ్చినా గేట్లను బార్లా తీస్తున్నారని రెవెన్యూ సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఇలా ఒక శాఖపై మరో శాఖ తప్పును నెట్టి తప్పించుకోవడం సామాన్య భక్తుల కష్టాలకు కారణమైంది.


