కశ్మీర్‌ మారథాన్‌–2026లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్‌ | - | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌ మారథాన్‌–2026లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్‌

Oct 18 2026 2:24 AM | Updated on Oct 18 2026 2:24 AM

కశ్మీర్‌ మారథాన్‌–2026లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్‌ ఎంబీబీఎస్‌ ఫలితాల్లో ఎస్‌ఎంసీ విద్యార్థుల ప్రతిభ రోడ్డు ప్రమాదంలో మెకానిక్‌ దుర్మరణం భవనం పై నుంచి పడి వైస్‌ ప్రిన్సిపాల్‌ దుర్మరణం చెరువులో పడి పశువుల కాపరి మృతి

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీనగర్‌ వేదికగా కశ్మీర్‌ మారథాన్‌–2026 నిర్వహిస్తోందని, ఆ మారథాన్‌లో పాల్గొనే క్రీడాకారులు ఆన్‌లైన్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఎన్టీఆర్‌ జిల్లా క్రీడాభివృద్థి అధికారి (డీఎస్‌డీవో) కె.కోటేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మారథాన్‌ ఈ నెల 25వ తేదీన శ్రీనగర్‌లో మొదలవుతుందని, ఈ లోగా వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. శారీరక దృఢత్వాన్ని ప్రోత్సహించడం, క్రీడా పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం, యువతలో క్రీడలపై ఆసక్తిని పెంపొందించడం ఈ మారథాన్‌ ముఖ్య ఉద్దేశమని, ఈ పోటీలలో దేశవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లు, రన్నర్లు, క్రీడలపై ఆసక్తి ఉన్న యువత పాల్గొనవచ్చునని తెలియజేశారు. మారథాన్‌లో పాల్గొనాలనుకునే వారు కశ్మీర్‌మారథాన్‌.జేకే.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లాలోని క్రీడాకారులు, రన్నర్లు, క్రీడా సంఘాలు, కోచ్‌లు, స్పోర్ట్స్‌ క్లబ్‌లు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల ప్రతినిధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎంబీబీఎస్‌ ఫేజ్‌–1 పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థులు 93.68 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆలపాటి ఏడుకొండలరావు తెలిపారు. డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో తమ విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విజయం కళాశాలకు గర్వకారణమన్నారు. విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యను అందించడంలో అధ్యాపకులు చూపుతున్న అంకితభావం, నిరంతర కృషి, బోధనేతర సిబ్బంది సహకారం ప్రధాన కారణాలని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షలకు సమర్థంగా సన్నద్ధమయ్యేలా మార్గనిర్దేశం చేసిన అధ్యాపకుల కృషిని ప్రత్యేకంగా అభినందించారు.

కంకిపాడు: రోడ్డు ప్రమాదంలో మెకానిక్‌ మృతి చెందిన సంఘటనపై శనివారం స్థానిక పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి తెలిపిన కథనం మేరకు... ఉంగుటూరు మండలం ఇందుపల్లి గ్రామానికి చెందిన బొకినాల ఉదయ్‌కుమార్‌ (45) గంగూరులోని కారు షోరూంలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 16వ తేదీ రాత్రి బైక్‌పై ఇంటికి వెళ్లే క్రమంలో పునాదిపాడు బైపాస్‌ సర్వీసురోడ్డులో బైక్‌ అదుపుతప్పి కింద పడటంతో గాయాల య్యాయి. క్షతగాత్రుడిని వైద్యం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి తెలిపారు.

పెనమలూరు: కానూరులో కాలేజీ భవనం పైనుంచి వైస్‌ ప్రిన్సిపాల్‌ కిందపడి అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటనపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ సందీప్‌ తెలిపిన వివరాల ప్రకారం పమిడిముక్కల మండలం బొడ్డువానిగూడెంకు చెందిన ఐల భాగ్యరాజు(27) కానూరులో ఒక ప్రైవేట్‌ కాలేజీలో వైస్‌ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నారు. ఆయన శనివారం ఉదయం కాలేజీ నాలుగో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందారు. మృతదేహాన్ని పోరంకిలో ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న మృతుడి బంధువులు కాలేజీ వద్దకు వచ్చి యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన పై మృతుడి సోదరుడు తిలక్‌ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కంచికచర్ల: పశువులు మేపేందుకు వెళ్లిన పశువుల కాపరి చెరువులో పడి మృతి చెందిన సంఘటన శనివారం మండలంలో జరిగింది. ఎస్‌ఐ శంకరరావు కథనం మేరకు కంచికచర్ల మండలం పేరకలపాడు గ్రామానికి చెందిన తోట్ల కృపానందం(70) గ్రామానికి చెందిన ఓ రైతుకు సంబంధించిన పశువులను మేపుతున్నాడు. యథావిధిగా శుక్రవారం పశువులను మేపేందుకు పొలం వెళ్లగా గ్రామ సమీపంలో ఉన్న చెరువులో పశువులు నీళ్లు తాగేందుకు వెళ్లాయి. ఆ పశువులను ఒడ్డుకు తోలే క్రమంలో కృపానందం చెరువులో పడి గల్లంతయ్యాడు. శుక్రవారం రాత్రి వరకు ఇంటికి రాకపోవటంతో రైతుతో పాటు కృపారావు కుటుంబసభ్యులు కృపానందం ఆచూకీ కోసం వెతికారు. శనివారం తిరిగి గాలింపు ప్రారంభించగా చెరువులో శవమై తేలియాడటంతో మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement