పీఎం శ్రీ నిధులు పక్కదారి! | - | Sakshi
Sakshi News home page

పీఎం శ్రీ నిధులు పక్కదారి!

Oct 16 2026 10:40 AM | Updated on Oct 16 2026 10:40 AM

పీఎం శ్రీ నిధులు పక్కదారి!

ఎన్టీఆర్‌ జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్‌ ప్రాజెక్టు కార్యాలయం కేంద్రంగా అక్రమాలు ప్రధానోపాధ్యాయులంతా కలిసి ఒకే వెండర్‌ దగ్గర కొనుగోలు ఆ వెండర్‌ దగ్గర నుంచి కమీషన్ల రూపంలో వసూళ్లు ఎవరి వాటా ఎంతో ఆ ‘ప్రధాన అయ్యోర్లకే’ ఎరుక!

అసలేం జరిగిందంటే..

విచారణ చేస్తాం..

సాక్షి, విజయవాడ: ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా(పీఎం శ్రీ) స్కూళ్ల అభివృద్ధి కోసం కేటాయించాల్సిన నిధులు పక్కదారి పడుతున్నాయి. ఈ స్కూళ్లలో పని చేసే ప్రధానోపాధ్యాయులు కొందరు ఒకే వెండార్‌ దగ్గర స్కూళ్లకు అవసరమైన సామగ్రి కొనుగోలు చేసి.. నీకింత నాకింత అనే ధోరణిలో భారీగా కమీషన్లు దండుకున్నారనే ఆరోపణలు ఆ స్కూళ్లలో పని చేసే సిబ్బంది చెప్పడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఎంతో ఉన్నతాశయంతో 2022 సెప్టెంబర్‌ 7న జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)లో భాగంగా ఈ పీఎం శ్రీ పథకం ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా ఉన్న 14,500కు పైగా ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శవంతమైన స్కూళ్లుగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తూ ప్రారంభించారు. వీటికి వచ్చే నిధుల మంజూరులో మన రాష్ట్రానికి వచ్చే సరికి కేంద్రం వాటా 60 శాతం, రాష్ట్రం వాటా 40 శాతం కేటాయిస్తాయి.

గ్రాంట్‌ వినియోగ నిబంధనలు ఇలా..

పీఎం శ్రీ స్కూళ్లకు పీఎం శ్రీ పథకం కింద ప్రతి స్కూల్‌కు ఏటా రెండు రకాల గ్రాంట్లు వస్తాయి. అందులో 2024–25, 2025–26 కు సంబంధించి కాంపోజిట్‌ స్కూల్‌ గ్రాంట్‌ అనేది ఏటా విద్యార్థుల సంఖ్యను బట్టి వస్తుంది. స్కూల్‌లో 30 మంది లోపు విద్యార్థులు ఉంటే రూ. 25,000, సుమారు 100 వరకు ఉంటే రూ.50,000, అలాగే 250 మంది వరకు ఉంటే రూ.75,000, అలాగే 1000 మంది పైన విద్యార్థులు ఉంటే రూ.1,00,000 వస్తుంది. ఈ నిధుల్లో కనీసం 10 శాతం నిధులను స్వచ్ఛత యాక్షన్‌ ప్లాన్‌ (మరుగుదొడ్లు, తాగునీరు, చేతి కడుక్కునే స్టేషన్లు, చెత్త డబ్బాలు)కు తప్పనిసరిగా వాడాలి. మిగిలిన 90శాతం నిధులను లైబ్రరీ పుస్తకాలు, స్పోర్ట్స్‌ సామగ్రి, ల్యాబ్‌ కెమికల్స్‌, ఎలక్ట్రిక్‌ బిల్లు, పాఠశాల ఫర్నిచర్‌ చిన్న మరమ్మతులు (బల్లలు, బెంచీలు), ఇంటర్నెట్‌, జిరాక్స్‌, స్టేషనరీ తోట, పాఠశాల అందం (గ్రీన్‌ స్కూల్‌)కోసం వినియోగించాలి. ఈ నిధులను స్కూళ్లలో భవన నిర్మాణం, టీచర్ల జీతాలు, వ్యక్తిగత వస్తువులను కొనకూడదు. ఏ వస్తువు కొనుగోలు చేసినా వాటికి సంబంధించి పీఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌లోనే అన్ని ఖర్చులు బిల్లుల రూపంలో ఎంటర్‌ చేయాలి. ఎస్‌ఎంసీ/ఎస్‌ఎండీసీ తీర్మానం తప్పనిసరి. అలాగే 3 కొటేషన్లు, బిల్లులు భద్రపరచాలి.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో 56 పీఎం శ్రీ స్కూళ్లు ఉన్నాయి. అయితే 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలో ఉన్న 29 స్కూళ్లకు గానూ ఈ ఏడాది రూ.117.88 లక్షలు మంజూరు కాగా.. ఇప్పటికే రూ.102.66 లక్షలకు బిల్లులు సైతం అప్‌లోడ్‌ చేశారు. అక్టోబర్‌ నెల నాటికే 90 శాతం నిధులు వాడేశారు. ఈ నిధులు ఎన్టీఆర్‌ జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్‌ ప్రాజెక్టు కార్యాలయం కేంద్రంగా పక్కదోవ పట్టాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీఎం శ్రీ పాఠశాలలకు మంజూరు చేసే నిధులతో ఆయా ప్రధానోపాధ్యాయులు స్కూల్స్‌లో, విద్యార్థులకు అవసరమైన సైన్సు ల్యాబ్‌, మైదానాలు, క్రీడా పరికరాలు తదితర అవసరాలకు వినియోగించాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయా పరికరాలు సరఫరా చేసిన వెండర్‌కు నేరుగా నిధులు జమ కావాల్సి ఉంది. కానీ ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల నిధులను కమీషన్ల రూపంలో దండుకునేందుకు పెద్ద ప్రణాళికలే రచించినట్లు తెలుస్తోంది. అన్ని పాఠశాలలకు ఒక్కడే వెండర్‌ను ఎంచుకొని, ఈ నిధులు అసలు ఖర్చు ఎంతో తెలియని విధంగా, కమీషన్ల రూపంలో అడ్డదారిలో పంచుకుంటున్నట్లు సమాచారం. సంబంధిత ఉన్నతాధికారులు వీటిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పీఎం శ్రీ స్కూళ్లకు సెంట్రల్‌ గవర్నమెంటు నుంచే ప్రొక్యూర్‌మెంట్‌ వస్తాయి. కొన్ని మాత్రమే స్కూల్‌ కమిటీలు కొనుగోలు చేస్తాయి. ఏదైనా నిధులు పక్కదారి అని తెలిస్తే విచారణ చేయిస్తాం.

– రమేష్‌బాబు, సమగ్రశిక్ష అడిషనల్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌, ఎన్టీఆర్‌ జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement