దుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి

Oct 16 2026 10:40 AM | Updated on Oct 16 2026 10:40 AM

దుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి రాజమండ్రి సెంట్రల్‌ జైలు ఖైదీ మృతి రూ. 15.50లక్షల బంగారు పాదుకలు, పళ్లెం సమర్పణ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుడిపై హత్యాయత్నం

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ గురువారం దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు మంత్రికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి దర్శనం కల్పించారు. వేదాశీర్వచనం అందించి, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి చల్లని దీవెనలు రాష్ట్ర, దేశ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు ఖైదీ గురువారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. విజయవాడ కామకోటి నగర్‌కు చెందిన బోయ రవి (34) ఓ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అతడికి కాన్సర్‌ వ్యాధి ఉంది. జైలులో ఉండగా తీవ్ర అనారోగ్య సమస్య తలెత్తింది. తొలుత రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సిఫారసు మేరకు బుధవారం రాత్రి కాకినాడ జీజీహెచ్‌కు తీసుకువచ్చి చేర్చారు. అక్కడి కాన్సర్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తుండగా ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో గురువారం ఉదయం మృతి చెందాడు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు గురువారం రూ. 15లక్షల విలువైన బంగారు పళ్లెం, పాదుకలను కానుకగా సమర్పించారు. విజయవాడ మోడ్రన్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ పంగలూరి శేషగిరిరావు, సునీత దంపతులు అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి వచ్చారు. ఆలయ చైర్మన్‌ రాధాకృష్ణ, స్థానాచార్య శివప్రసాద్‌ శర్మలను కలిసి కానుకలను అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుడిపై గుర్తు తెలియని వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీఆర్‌పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మల్లికార్జునపేట, రావిచెట్టు ప్రాంతానికి చెందిన లంకపల్లి సాయితేజ(28) హోటల్‌లో పనిచేస్తూ కుటుంబంతో కలసి జీవిస్తున్నాడు. ఈ నెల 9న రాత్రి రాజమండ్రి వెళ్లేందుకు విజయవాడ రైల్వేస్టేషన్‌ చేరుకుని టికెట్‌ కోసం సౌత్‌ బుకింగ్‌ కార్యాలయానికి చేరుకున్నాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి హిందీలో మాట్లాడుతూ సాయితేజను ఫోన్‌ ఇవ్వమని అడిగాడు. తన వద్ద లేదని చెప్పడంతో అతన్ని కొట్టి, జేబులో నుంచి కత్తెర బయటకు తీసి ఎడమవైపు పక్కటెముకల భాగంలో పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో సాయితేజ పడిపోయాడు. నిందితుడు అక్కడ నుంచి పరారయ్యడు. వెంటనే స్థానికులు 108కి సమాచారం అందించడంతో వారు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. దీనిపై ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు విజయవాడ జీఆర్‌పీ పోలీసులు అక్కడకు చేరుకుని బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement