అమరావతితో పాటు సమాంతరంగా అభివృద్ధి చేయాలి సీపీఎం రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు
కృష్ణలంక(విజయవాడతూర్పు): అమరావతితో పాటు విజయవాడను కూడా జంట నగరాలుగా.. సమాంతరంగా అభివృద్ధి చేయాలని, లేనిపక్షంలో నగరం డెడ్ సిటీగా మారుతుందని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్‌పేటలోని బాలోత్సవ భవన్‌లో సీపీఎం ఆధ్వర్యంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డి.కాశీనాథ్ అధ్యక్షతన గురువారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ జంద్యాల శంకర్ మాట్లాడుతూ అర్హత లేని నాయకత్వం, సరైన శిక్షణ లేని అధికారుల వలన నగర పరిపాలన కుంటుపడుతోందని విమర్శించారు. నగరంలో కొత్త లేఅవుట్లలో లిక్విడ్, సాలిడ్ వేస్ట్ డిస్పోజల్, టాయిలెట్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల భవిష్యత్‌లో తీవ్రమైన సమస్యలు వస్తాయని హెచ్చరించారు.
నిధులు వెచ్చించాలి..
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ 15 లక్షలకు పైగా జనాభా ఉన్న విజయవాడకు తగిన నిధులు కేటాయించకపోవడంపై మండిపడ్డారు. సీఆర్డీఏ నిధుల్లో 50 శాతం నిధులను విజయవాడ అభివృద్ధికి కేటాయించాలని, గత 12 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న మెట్రో రైలు లేదా ప్రత్యామ్నాయ ప్రజా రవాణా వ్యవస్థను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు.
సలహాలు తీసుకోవాలి..
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలను, మేధావుల సలహాలను తీసుకోవడం ప్రభుత్వాల బాధ్యత అని గుర్తు చేశారు. జీవో నంబర్ 74 తెచ్చి వైద్య, విద్య, మంచినీరు, డ్రెయినేజీ వంటి ప్రాథమిక రంగాలను ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
అది హాస్యాస్పదం..
ప్రజా వైద్యశాల వైద్యుడు డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ అమరావతి నిర్మాణం కోసం విదేశీ టౌన్ ప్లానర్లను పిలవడం, సినిమా డైరెక్టర్ల చేత అప్రూవల్ చేయించడం వంటి అంశాలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఐలూ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర రాజేంద్రప్రసాద్, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.సాంబిరెడ్డి, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, న్యూ డెమోక్రసీ నాయకుడు పోలారి, లయోలా కాలేజ్ ప్రతినిధి దాసు, డాక్టర్ పట్టాభిరామ్, జి.నాగేశ్వరరావు తదితరులు మాట్లాడారు.


