సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు | - | Sakshi
Sakshi News home page

సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు

Oct 16 2026 10:40 AM | Updated on Oct 16 2026 10:40 AM

కంకిపాడు: సాగునీటి సమస్యపై రైతులు రోడ్డెక్కారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కోమటిగుంట రెగ్యులేటర్‌ వద్ద ధర్నాకు దిగారు. రెండు రోజుల్లో పంట కాలువలకు సాగునీటిని మళ్లించి తమను ఆదుకోకపోతే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు. పంటలు ఎండిపోతే తమకు ఆత్మహత్యలే దిక్కు అని వాపోయారు. మండలంలోని మంతెన, తెన్నేరు, జగన్నాథపురం గ్రామాలకు చెందిన రైతులు గురువారం కోమటిగుంట రెగ్యులేటర్‌ వద్ద మెరుపు ధర్నాకు దిగారు. పంట కాలువలకు నీటిని మళ్లించి చిరుపొట్టదశలో ఉన్న వరి పైర్లను కాపాడాలని రైతులు నినాదాలు చేశారు. మంతెన, తెన్నేరు, జగన్నాఽథపురం, కండ్రిక, తరిగొప్పల గ్రామాల పరిధిలో సుమారు 3500 ఎకరాల్లో వరి పైరు సాగులో ఉందని, ప్రస్తుతం చిరుపొట్ట దశలో ఉన్న పైరుకు సాగునీరు అందక పొలాలు నెర్రలిస్తున్నాయని, పంటలు ఎండుముఖం పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా విధులు నిర్వర్తిస్తున్న లాకు సూపరింటెండెంట్‌కు రైతులు సాగునీటి సమస్యను విన్నవించారు. సాగునీటి కోసం విజయవాడలో ధర్నా చేసుకోవాలని ఆ అధికారి సూచించటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాలకుల నిర్లక్ష్యమే కారణం..

వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి కొండవీటి వెంకట సుబ్బారావు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఏటా రెగ్యులేటర్‌ లెవల్‌ మెయింటెనెన్స్‌ లోపాలు కారణంగా ఎగువ ప్రాంతాల్లో సాగు చేస్తున్న తమ పొలాలు దెబ్బతిని ఆర్థికంగా నష్టపోతున్నామన్నారు. పాలకులు, అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపించారు. ఎకరాకు రూ 30 వేలకు పైగా పెట్టుబడులు పెట్టామని, చిరు పొట్ట దశలో ఉన్న వరి పైర్లకు ప్రస్తుతం సాగునీరు అవసరమన్నారు. సమస్యను స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, ఇరిగేషన్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు.

కోమటిగుంట రెగ్యులేటర్‌ వద్ద ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement