నున్న(విజయవాడరూరల్): ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో నున్న గ్రామంలో ఇళ్ల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయడంపై స్థానిక మహిళలు గురువారం ఆందోళన చేశారు. గ్రామ పంచాయతీతో పాటు సంబంధిత శాఖల నుంచి అనుమతులు పొందకుండానే మద్యం దుకాణం ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ మద్యం దుకాణం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. నున్న–గుణదల రోడ్డులో ఓ అపార్ట్‌మెంట్ పక్కనే ఉన్న భవనంలో విజయవాడ నగరానికి చెందిన ఓ వ్యక్తి మద్యం దుకాణం ఏర్పాటు చేశారు. ఇటీవల నిర్వహించిన మద్యం వేలంలో ప్రొవిజనల్ లైసెన్స్ పొందిన సదరు వ్యక్తి స్థానికంగా అవసరమైన అనుమతులు తీసుకోకుండానే దుకాణం ప్రారంభించారని మహిళలు ఆరోపించారు. ఇరుకై న రోడ్డు పక్కన, నివాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయడం వల్ల తమకు భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దుకాణాన్ని తక్షణమే తొలగించాలని, లేనిపక్షంలో ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
తాత్కాలికంగా మూసివేత..
మహిళల నిరసనతో నున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మద్యం దుకాణం, గ్రామ పంచాయతీ అనుమతులపై ఆరా తీశారు. తక్షణమే దుకాణాన్ని మూసివేయాలని నిర్వాహకుడికి సూచించారు. దీంతో దుకాణాన్ని తాత్కాలికంగా మూసివేశారు. తిరిగి తెరిస్తే మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మహిళలు హెచ్చరించారు.


