పోలీసుల అదుపులో భూ నిర్వాసితులు | - | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో భూ నిర్వాసితులు

Oct 15 2026 11:41 AM | Updated on Oct 15 2026 11:41 AM

గన్నవరం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల విజయవాడ పర్యటన నేపథ్యంలో విమానాశ్రయ భూ నిర్వాసితులు, వారికి మద్దతు ఇస్తున్న ప్రజా సంఘాల నేతల నాయకులను పోలీసులు బుధవారం ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. భూ నిర్వాసితుల సంఘ నేతలు యు.వేదవతి, తిరివీధి ఏసురత్నం, మరో ఎనిమిది మంది ప్రజా సంఘాల నాయకులను ఉదయమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించిన పోలీసులు బైండోవర్‌ చేశారు. పోలీసుల తీరుపై నిర్వాసితులు, ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 రోజులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తుల మాదిరిగా పోలీసులు నిర్బంధించడంపై మండిపడ్డారు. వారి అక్రమ అరెస్ట్‌లను సీపీఎం జిల్లా కార్యదర్శి వై. నరసింహారావు, కార్యవర్గ సభ్యుడు కళ్లం వెంకటేశ్వరరావు ఖండించారు.

సుంకర పద్మశ్రీ హౌస్‌ అరెస్ట్‌

విమానాశ్రయ భూనిర్వాసితులకు మద్దతు తెలిపిన ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీని ఆత్కూరులోని ఆమె ఇంటి వద్ద పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. పోలీసుల తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాశ్రయ విస్తరణ కోసం ఇళ్లు, స్థలాలు ఇచ్చిన నిర్వాసితులు రోడ్డెక్కి పోరాడు తుంటే సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించారు.

వేదవతిని స్టేషన్ల

చుట్టూ తిప్పిన పోలీసులు

విమానాశ్రయ భూ నిర్వాసితులకు చెందిన ప్లాట్స్‌ ఓనర్ల అసోసియేషన్‌ ప్రతినిధి యు.వేదవతిని ఉదయం 11 గంటలకు పోలీసులు గన్నవరంలో అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆమెను పోలీస్‌ వాహనంలో నాగాయలంక పోలీస్‌స్టేషన్‌కు, అక్కడి నుంచి మచిలీపట్నంలోని ఇనుకుదురుపేట స్టేషన్‌కు తీసుకెళ్లి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్బంధించారు. అనంతరం రాత్రి 7.50 గంటలకు పోరంకిలోని ఆమె నివాసం వద్ద వదిలివేశారు. తనతో పోలీసులు వ్యవహరించిన తీరుపై వేదవతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement