వెస్ట్‌ బైపాస్‌పై ప్రమాద నిరోధక చర్యలేవి? | - | Sakshi
Sakshi News home page

వెస్ట్‌ బైపాస్‌పై ప్రమాద నిరోధక చర్యలేవి?

Oct 14 2026 11:22 AM | Updated on Oct 14 2026 11:22 AM

వెస్ట్‌ బైపాస్‌పై ప్రమాద నిరోధక చర్యలేవి?

విజయవాడరూరల్‌: వెస్ట్‌ బైపాస్‌ (జాతీయ రహదారి నెంబరు 16 ) పై వాహనాలు ప్రమాదానికి గురికాకుండా రక్షణ చర్యలను చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా జాతీయ రహదారి కింది భాగంలో రైల్వే ట్రాక్‌, కాలువలు, నదులున్న ప్రాంతంలో రోడ్డు వెడల్పు తగ్గించి పుట్‌పాత్‌ నిర్మాణాలతో డిజైన్‌ వుంటుంది. అలాంటి చోట వాహనాలు ప్రమాదాలకు గురికాకుండా వుండేందుకు గాను ఫుట్‌పాత్‌ బ్రిడ్జి సమీపంలో ప్లాస్టిక్‌ బ్యారెల్స్‌ను ఏర్పాటు చేయాల్సి వుంది. అలా బ్యారెల్స్‌ ఏర్పాటు చేయడం వలన వాహనం అదుపు తప్పినా బ్యారెల్స్‌ను ఢీకొని ప్రాణాపాయం తగ్గుతుంది. సోమవారం వెస్ట్‌ బైపాస్‌ రోడ్డులో గొల్లపూడి వద్ద జరిగిన ఎలక్ట్రికల్‌ కారు ఫుట్‌పాత్‌ వద్ద బ్యారెల్స్‌ లేకపోవడం వలన కారు అదుపు తప్పి నేరుగా క్రాష్‌బేరర్స్‌ షోల్డర్‌పై ఎక్కి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నున్న గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని చంటి పిల్లాడితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ ప్రమాదం జరగటానికి నిర్వహణ లోపమే కారణమని పలువురు వాఖ్యానిస్తున్నారు. గొల్లపూడి జంక్షన్‌ నుంచి చిన అవుటపల్లి వరకు సుమారు 16 చోట్ల రోడ్డు వెడల్పు తగ్గించి పుట్‌పాత్‌లను నిర్మించారు. అలాంటి చోట్ల ప్రమాదాల నివారణకు ఏర్పాటు చేయాల్సిన ప్లాస్టిక్‌ బ్యారెల్స్‌ నామమాత్రంగా ఏర్పాటు చేశారు. అంబాపురం గ్రామం వద్ద రోడ్డుకిరువైపులా బ్యారెల్స్‌, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేశారు. అక్కడ మినహాయించి 30 కిలో మీటర్ల దూరంలో మరెక్కడా బ్యారెల్స్‌, రేడియం స్టిక్కర్లు కనిపించడం లేదు.

సంవత్సరం నుంచి జాతీయ రహదారి రన్నింగ్‌

వెస్ట్‌ బై పాస్‌ రోడ్డులో సుమారు ఏడాది కాలంగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రోడ్డు నిర్వహణ బాధ్యతలను నేషనల్‌ హైవే కాకుండా కాంట్రాక్ట్‌ సంస్థ నిర్వహిస్తోందని సిబ్బంది అంటున్నారు. అధికారులు, కాంట్రాక్ట్‌ సంస్థ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపణలు వినవస్తున్నాయి. అంతేకాకుండా రాత్రి సమయాల్లో వాహనాల రాకపోకలకు వీలుగా హైవేపై దీపాలను ఏర్పాటు చేయాలని, డైవర్షన్‌ మార్కింగ్‌ కూడా క్లియర్‌గా కనిపించే విధంగా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు సంబంధిత శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement