లబ్బీపేట(విజయవాడతూర్పు): మాదకద్రవ్యాల వినియోగానికి ఉపయోగపడే వస్తువుల విక్రయంపై ఈగల్ అధికారులు మంగళవారం ఆన్‌లైన్, ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలోని ఈగల్ కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్ ఎం.రవీంద్ర నిర్వహించిన ఈ సమావేశంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జెప్టో, బిగ్‌బాస్కెట్, బ్లింకిట్ వంటి సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ ఆన్‌లైన్ వేదికలపై విక్రయించే ఉత్పత్తుల వివరాలను బాధ్యతాయుతంగా పరిశీలించాలని సూచించారు. కొన్ని వస్తువులను గంజాయి, కొకై న్ వంటి నిషేధిత మాదకద్రవ్యాల వినియోగానికి ఉపయోగించే అవకాశం ఉన్నందున, వాటి విక్రయాలు, సరఫరా, డెలివరీలకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రోలింగ్ పేపర్లు, హుక్కా పరికరాలు విక్రయానికి అందుబాటులో ఉన్నంత మాత్రాన అవి స్వయంచాలకంగా చట్టవిరుద్ధమైన వస్తువులుగా పరిగణించబడవన్నారు. అయితే నిషేధిత మాదకద్రవ్యాల వినియోగం, సంబంధిత నేరాలతో వాటికి సంబంధం ఉన్నట్లు ఆధారాలు లభించిన సందర్భాల్లో వర్తించే చట్టాల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఆర్‌ఐ నాగార్జున, ఎస్‌ఐ ఎస్.దుర్గాభవాని, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ప్రతినిధులు తరుణ్ వెంకటేష్, వంకూరి నరేందర్‌రెడ్డి, పి.రమేష్, సుధాకర్, సూర్య తదితరులు పాల్గొన్నారు.


