గన్నవరం: విమానాశ్రయ విస్తరణలో ఇళ్లు, ప్లాట్లు కోల్పోయిన బాధితుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించి తక్షణ న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద విమానాశ్రయ భూ నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని ఆయన సోమవారం సందర్శించి, వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా తమ సమస్యలను బాధితులు వంశీకి వివరించారు. అనంతరం వంశీమోహన్ మాట్లాడుతూ.. 2014లో తాను టీడీపీ ఎమ్మెల్యేగా ఉండగానే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు విమానాశ్రయ విస్తరణ కోసం ఈ ప్రాంత రైతులు, ఇళ్లు, ప్లాట్ల యజమానులను ఒప్పించి భూములను సమీకరించినట్లు గుర్తుచేశారు. ఇళ్లు కోల్పోయిన 423 నిర్వాసిత కుటుంబాలకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద గృహాలు, ప్లాట్లు కోల్పోయిన వారికి అజ్జంపూడిలో తిరిగి ప్లాట్లు కేటాయిస్తామనే హామీ అమలు చేయకుండా టీడీపీ ప్రభుత్వం దిగిపోయిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద నిర్వాసితులకు ప్లాట్లు కేటాయించడంతో పాటు దస్తావేజులను కూడా అందజేసినట్లు తెలిపారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బాధితులను పూర్తిగా గాలికి వదిలివేసిందని విమర్శించారు. విమానాశ్రయ భూ నిర్వాసితుల సమస్యలను గత ఫిబ్రవరిలోనే గ్రీవెన్స్‌లో కృష్ణా జిల్లా కలెక్టర్‌కు అర్జీ ఇచ్చి పరిష్క రించాలని కోరినా ఇప్పటి వరకూ స్పందన లేదని పేర్కొన్నారు. అవసరమైన సీఎం చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరానికి కృషి చేస్తానని బాధితులకు వంశీమోహన్ హామీ ఇచ్చారు.
వంటావార్పు
తొలుత విమానాశ్రయ నిర్వాసితులు తమ ఆందోళనలో భాగంగా వంటావార్పు నిర్వహించారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ, సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు పాల్గొని సంఘీభావం తెలిపారు. ప్రైవేట్ సంస్థ నిర్మించిన భోగపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రూ.400 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఇక్కడి బాధితులకు రూ.120 కోట్లు కేటాయించేందుకు మీనమేషాలు లెక్కిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రపతి పర్యటన పేరుతో నిర్వాసితుల దీక్ష శిబిరాన్ని తొలగించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.


