వీఆర్‌ఏల రోదన | - | Sakshi
Sakshi News home page

వీఆర్‌ఏల రోదన

Oct 12 2026 8:28 AM | Updated on Oct 12 2026 8:28 AM

వీఆర్‌ఏల రోదన

రోడ్డెక్కిన గ్రామ రెవెన్యూ సహాయకులు సెప్టెంబర్‌ 16 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్‌ఏలు రెవెన్యూ శాఖలో ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్నా.. ఉద్యోగ భద్రత కరువు విధుల్లో ఉంటూ చనిపోయిన వారి కుటుంబాలకు భరోసా శూన్యం అరకొర వేతనంతో కుటుంబ పోషణకు అగచాట్లే.. ఊరడించే మాటలు చెప్పి పంపుతున్న ప్రభుత్వం

మా డిమాండ్లు నెరవేర్చాలి..

సాక్షి, విజయవాడ: ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్నా.. పదవీ విరమణ లేక.. విధుల్లో ఉంటూ చనిపోతే కుటుంబ సభ్యులకు భరోసా లేక అరకొర వేతనంతో ఏళ్ల తరబడి నెట్టుకొస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులు కడుపు మండి రోడ్డెక్కారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమం ప్రారంభం నుంచి ముగిసే వరకు అహర్నిశలు శ్రమించే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా తమ బతుకులు మాత్రం మారడం లేదని వాపోతున్నారు. ప్రతి పనికీ అధికారులు తమనే వాడుకుంటారని, చేసే ఉద్యోగానికి రిటైర్‌మెంట్‌ లేక బతికనంతకాలం పని చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని చేస్తూ చనిపోతే భరోసా లేదని, తమ కుటుంబాలకు భరోసా కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో..

దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ వీఆర్‌ఏలు సెప్టెంబర్‌ 16 నుంచి 24 రోజులుగా వీఆర్‌ఏలు నిరసన కార్యక్రామాలు చేపడుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 1,400 మంది వరకు వీఆర్‌ఏలు తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద నిరనసలు చేపడుతున్నారు. బిక్షాటన చేస్తూ, రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలకు, పలువురు ప్రముఖుల విగ్రహాలకు విజ్ఞాపన పత్రాలు అందజేస్తూ.. కనిపించిన ప్రతి ఉన్నతాధికారి ఎదుట ఘోస చెప్పుకుంటున్నారు. ఏళ్ల తరబడి నౌకర్లుగా పని చేస్తున్న తమ జీవితాలకు భరోసా లేక, ప్రమోషన్లు లేక బతుకీడుస్తున్నామని వాపోతున్నారు. ప్రముఖుల పర్యటనల సమయాల్లో కొన్నిసార్లు కనీసం కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా సమయం ఇవ్వడం లేదని పలువురు మహి ళా వీఆర్‌ఏలు వాపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్‌ఏలు నిరసన్నల్లోకి వెళ్లడంతో రెవెన్యూ శాఖ చేపడుతున్న పనులకు అంతరాయం ఏర్పడింది.

ఉద్యోగం చిన్నది.. పనులు ఎక్కువ..

ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలో వీరే కీలకం. ప్రముఖుల పర్యటనల్లోనూ ఉరుకులు పరుగులు పెడుతుంటారు. భూమి శిస్తు వసూళ్లు, రీసర్వేలో పాల్గొంటున్నారు. దీనికి తోడు బీఎల్‌ఏలుగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరికి వచ్చే రూ.10,500 వేతనంలో సగం జీతం తిరగడానికే పోతే కుటుంబ పోషణ భారంగా ఉందని చెబుతున్నారు. సచివాలయ సిబ్బంది, తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది ఎవరు పిలిచినా ఏ టైమ్‌లో పిలిచినా వారి వెంట పరుగులు పెట్టాలి.

జీవోల రూపంలో ఇవ్వాలని కోరుతున్నా..

రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ దగ్గర నుంచి రెవెన్యూ మంత్రితో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులను కలిసి గ్రామ రెవెన్యూ సహాయకులు తమ గోడు చెప్పుకుంటున్నారు. పే స్కేల్‌ అమలు చేయాలని విన్నవిస్తున్నారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ఉన్నతాధికారులు మాత్రం చేద్దాం అని ఊరడించే మాటలు చెప్పి పంపుతున్నారని వీఆర్‌ఏలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవోల రూపంలో తమకు హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

డిమాండ్లు ఇవీ..

● పే స్కేల్‌ అమలు చేయాలి

● నామినీలుగా పని చేస్తున్న వారిని రెగ్యులరైజ్‌ చేయాలి

● ఉద్యోగం చేస్తూ 65 ఏళ్లు దాటి చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలి

● ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి వీఆర్‌ఓలుగా ప్రమోషన్‌ కల్పించాలి

ఏళ్ల తరబడి రెవెన్యూ సహాయకులుగా పని చేస్తున్నాం. మాకు ఉద్యోగ భద్రత లేదు. సెప్టెంబర్‌ 16 నుంచి మేము నిరసనలు తెలుపుతున్నాం. మాకు వచ్చే రూ.10,500 వేతనంతో నానా అవస్థలు పడుతున్నాం. ఉన్నతాధికారులకు మా గోడు చెప్పుకుంటున్నాం. మాకు రిటైర్‌మెంట్‌ లేదు. ఎన్నేళ్లయినా నౌకర్లుగా చాకిరీ చేయాలి. వయసు మీద పడి సహకరించక నామినీలుగా పెట్టుకున్న వారిని పర్మనెంట్‌ చేయాలని కోరుతున్నాం. కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు.

– వి.వెంకటరత్నం, ఉమ్మడి కృష్ణా జిల్లా వీఆర్‌ఏల సంఘం అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement