ఆసియా మాస్టర్స్‌ ఆక్వాటిక్‌ చాంపియన్‌షిప్‌లో జవాన్‌ ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

ఆసియా మాస్టర్స్‌ ఆక్వాటిక్‌ చాంపియన్‌షిప్‌లో జవాన్‌ ప్రతిభ

Oct 12 2026 8:28 AM | Updated on Oct 12 2026 8:28 AM

ఆసియా మాస్టర్స్‌ ఆక్వాటిక్‌ చాంపియన్‌షిప్‌లో జవాన్‌ ప్రతిభ బనానా క్లబ్‌ వస్త్రదుకాణం ప్రారంభం కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య ఇంటి నుంచి వెళ్లిన వృద్ధుడు శవమై కనిపించాడు

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): బెంగళూరులో ఈ నెల 4 నుంచి 11వ తేదీ వరకు జరిగిన రెండో ఆసియా మాస్టర్స్‌ ఆక్వాటిక్‌ చాంపియన్‌షిప్‌–2026లో ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన బీఎస్‌ఎఫ్‌ (బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌) జవాన్‌ జి.శ్రీకాంత్‌ అద్భుత ప్రతిభ చూపి వివిధ విభాగాల్లో మూడు పతకాలు సొంతం చేసుకున్నాడు. 30–34 ఏళ్ల విభాగంలో 400 మీటర్ల వ్యక్తిగత విభాగంలో సిల్వర్‌ మెడల్‌, 200 మీటర్ల బటర్‌ఫ్లై విభాగంలో బ్రాంజ్‌, 100 మీటర్ల బటర్‌ఫ్లై విభాగంలో బ్రాంజ్‌ మెడల్‌ సాధించాడు. విజయవాడకు చెందిన చెందిన శ్రీకాంత్‌ ప్రస్తుతం బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ పంజాబ్‌లో జవాన్‌గా సేవలు అందిస్తున్నారు. విధి నిర్వహణలో బిజీగా ఉంటూనే, క్రీడలపై మక్కువతో తీవ్రంగా శ్రమించి ఈ అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించడం విశేషమని ఎన్టీఆర్‌ జిల్లా స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ సెక్రటరీ ఐ.రమేష్‌ తెలిపారు. శ్రీకాంత్‌ను రమేష్‌, సంఘం సభ్యులు, క్రీడా ప్రముఖులు అభినందించారు.

పటమట(విజయవాడతూర్పు): బెంజిసర్కిల్‌ వద్ద ఉన్న నూరానీ ప్లాజాల్లో నూతనంగా ఏర్పటు చేసిన బనానా క్లబ్‌ వస్త్రదుకాణం ఆదివారం ప్రారంభమైంది. బిగ్‌బాస్‌ ఫేమ్‌ పడాల కల్యాణ్‌ ఈ షోరూమ్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా కల్యాణ్‌ మాట్లాడుతూ.. నేటి యువత ఆసక్తి మేరకు వివిధ డిజైన్లు, రంగుల్లో అందుబాటు ధరల్లో ఇక్కడ వస్త్రాలు లభ్యమవుతాయన్నారు. కార్యక్రమంలో షోరూమ్‌ మేనేజర్‌ వెంకటేష్‌ మాట్లాడుతూ.. విజయవాడలో ఇది మొదటి షోరూమ్‌ అని, తమ షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా మొద టి 200 మంది వినియోగదారులకు టీ షర్టును ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు.

కంకిపాడు: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై స్థానిక పోలీసుస్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. ఎస్‌ఐ కేవై దాసు తెలిపిన కథనం మేరకు.. మండలంలోని మద్దూరు గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ రామకృష్ణ(38)కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కార్పెంటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబంలో ఏర్పడిన కలహాల కారణంగా మనస్తాపానికి గురై ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి తల్లి కొక్కిలిగడ్డ కుమారి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

పాయకాపురం(విజయవాడరూరల్‌): ఇంటి నుంచి వెళ్లిన వృద్ధుడు శవమై కనిపించిన సంఘటన ఆదివారం జరిగింది. నున్న రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వాంబే కాలనీ హెచ్‌ బ్లాక్‌లో భార్యతో నివాసం ఉంటున్న తాడిని చిన్నారావు(60) లారీ డ్రైవర్‌. అతను గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో కుటుంబ సభ్యులు చికిత్స చేయించారు. ఈ నెల 11వ తేదీ ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లిన చిన్నారావు ఇంటికి తిరిగి రాకపోవడంతో చిన్నారావు భార్య కృష్ణలంకలో ఉంటున్న తన కుమారుడు శివకు ఫోన్‌ చేసి తండ్రి కనిపించడం లేదని చెప్పింది. తండ్రి కోసం వెతుకుతున్న శివకు దేవినేని గాంధీపురం మట్టి రోడ్డు దగ్గర తండ్రి చనిపోయి కనిపించాడు. ఈ విషయం పోలీసులకు తెలియజేయగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement