విజయవాడ కల్చరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దేవదాయ ధర్మదాయ శాఖ, శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కనకదుర్గానగర్‌లోని కళావేదికపై 10 రోజుల పాటు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు ఆదివారం ఉదయం ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువ నాట్యాకళాకారులు, యువ సంగీత కళాకారులు నాట్యాచార్యుల పర్యవేక్షణలో నిర్వహించిన సంగీత, నృత్య కార్యక్రమాలు అలరించాయి. దేవస్థాన నాదస్వర బృందం సంప్రదాయ మంగళ వాయిద్యాలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పి.ప్రమీలారాణి, ఎస్.రామాంజనేయులు తాళం భజన, ఎం.రవి భక్తిరంజని ఆకట్టుకున్నాయి. సంప్రదాయ నృత్య కార్యక్రమంలో భాగంగా కె.ప్రజ్వల, నాట్యాచార్యులు సప్పా శివకుమార్, వేదాంతం పార్థసారథి, ఎల్‌ఎం భువనేశ్వరి, సుముఖి శర్మ, చింతా శివరామకృష్ణ, అభినయ ఆర్ట్స్ అకాడమీ, శివకళా నృత్యాలయం, రాయన శ్రీనివాసరావు, ఎం.నామగమల్లీశ్వరి, వి.మహాలక్ష్మి తమ బృందాలతో సంప్రదాయ నృత్యాలను మనోహరంగా ప్రదర్శించారు.
త్యాగయ్యకు స్వరార్చన..
ముంబై నుంచి విచ్చేసిన జి.ఆశాకిరణ్ రెడ్డి నిర్వహించిన శాసీ్త్రయ సంగీత కచేరి సంగీత వైభవాన్ని చాటింది. త్యాగరాజస్వామి రచించిన పలు కీర్తనలను మధురంగా గానం చేశారు. అనంతరం కళాకారులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమాలను రామకృష్ణ నిర్వహించారు.
నిర్వహణ లోపం.. కళాకారులకు శాపం
కళా ప్రదర్శనకు వచ్చిన కళాకారులకు నిర్వహణ లోపం వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కళా వేదికపై లైటింగ్ సరిగా లేకపోవడం వల్ల ప్రదర్శన చేసే సమయంలో కొంత ఇబ్బంది ఎదురైంది. 200 మందికి సీటింగ్ ఏర్పాటు చేశామని చెప్పిన దేవస్థానం అధికారులు పట్టుమని 50 మందికి సరిపడా కుర్చీలు ఏర్పాటు చేయకపోవడం విచారకరం. కళా ప్రదర్శనలను చూడటానికి వచ్చిన ప్రేక్షకులు నిల్చునే ప్రదర్శనలను తిలకించారు. ఒక వైపు ఎండ తీవ్రంగా ఉన్నా కనీసం ఫ్యానులు ఏర్పాటు చేయకపోవడం వల్ల కళాకారులు అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. పొరపాట్లను సరిచేయాలని కళాకారులు, ప్రేక్షకులు కోరుతున్నారు.


