భవానీపురం(విజయవాడపశ్చిమ): జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వచ్ఛాంధ్ర జిల్లా స్థాయి పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం జరిగింది. స్వచ్ఛ మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, విలేజ్ ఆర్గనైజేషన్స్, పాఠశాలలు, అంగన్‌వాడీలు, ఆసుపత్రులు, వసతి గృహాలు తదితర కేటగిరీలలో మొత్తం 69 అవార్డులు లభించాయి. వీటిని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ ఎల్.దినకర్, ఎమ్మెల్సీ వర్ల రామయ్య, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర విజేతలకు అందజేసి అభినందించారు. స్వచ్ఛతా కార్యక్రమాలను సమర్ధంగా అమలు చేస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చిన స్వచ్ఛ సైనికులను ప్రశంసించారు. స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయంగా జిల్లా కలెక్టరేట్ అవార్డు సాధించగా కలెక్టర్ లక్ష్మీశ స్వీకరించారు. అదే విధంగా వీఎంసీ ప్రధాన కార్యాలయం కూడా అవార్డును సొంతం చేసుకుంది. స్వచ్ఛ మునిసిపాలిటీగా తిరువూరు మునిసిపాలిటీ అవార్డును కై వసం చేసుకుంది. గండ్రాయి, మైలవరం, గూడవల్లి, జూపూడి గ్రామ పంచాయతీలు స్వచ్ఛ గ్రామ పంచాయతీల కేటగిరిలో పురస్కారాలు పొందాయి. వ్యర్థాల నిర్వహణలో అత్యుత్తమ స్టార్టప్ట్స్ కేటగిరీలో సిసిర ఎలిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అవార్డును సొంతం చేసుకుంది. కార్యక్రమంలో డీపీఓ టి.సీతామహాలక్ష్మి, వీఎంసీ అడిషనల్ కమిషనర్లు ఎ.రవీంద్రరావు, కె.శకుంతల, చీఫ్ ఇంజినీర్ పి.సత్యకుమారి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ నిర్మల గ్లోరి, డెప్యూటీ కమిషనర్ సృజన తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లాలోని స్వచ్ఛ రథానికి అవార్డులు
ఉమ్మడి జిల్లాలోని స్వచ్ఛ రథానికి రాష్ట్ర, జిల్లా అవార్డులు లభించాయి. స్వచ్ఛత కార్యక్రమాల అమలు, ఉత్తమ పని తీరుకు గాను జిల్లా స్థాయి స్వచ్ఛ రథం, స్వచ్ఛత బెస్ట్ పెర్ఫామెన్స్ కేటగిరీలో జిల్లా పరిషత్ సీఈఓ డాక్టర్ జె.అరుణ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ చేతులమీదుగా షీల్డ్, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.


