బైండోవర్‌ ఉల్లంఘన.. వ్యక్తికి ఆరు నెలల జైలు | - | Sakshi
Sakshi News home page

బైండోవర్‌ ఉల్లంఘన.. వ్యక్తికి ఆరు నెలల జైలు

Oct 30 2026 7:36 AM | Updated on Oct 30 2026 7:36 AM

బైండోవర్‌ ఉల్లంఘన.. వ్యక్తికి ఆరు నెలల జైలు పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ పరిశీలన చెరువులో పడి వ్యక్తి గల్లంతు మహిళ హత్య కేసులో నిందితులకు బెయిల్‌ నిరాకరణ

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: బైండోవర్‌ ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తికి మండల ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. బాపులపాడు మండలం వీరవల్లికి చెందిన షీటర్‌ ఉప్పలపాటి కృష్ణపై గతంలో కృష్ణాజిల్లాతో పాటుగా ఇతర జిల్లాల్లోనూ నేరాలకు పాల్పడటంతో వీరవల్లి ఎస్‌ఐ సత్యం సురేష్‌ మండల ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ బి.మురళీ కృష్ణ ఎదుట హాజరుపర్చగా ఆరు నెలల పాటు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు, నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో మెలగాలని బైండోవర్‌ విధించారు. కానీ ఈ నిబంధలను ఉల్లంఘిస్తూ కేడీ షీటర్‌ ఉప్పలపాటి కృష్ణ తన భార్యను శారీరకంగా, మానసికంగా హింసించటంతో ఇటీవల వీరవల్లి పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదు అయింది. దీంతో వీరవల్లి పోలీసులు ఉప్పలపాటి కృష్ణను గురువారం మండల ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపర్చగా బైండోవర్‌ ఉల్లంఘనకు పాల్పడినందుకు ఆరు నెలల జైలుశిక్షను విధించారు. దీంతో ముద్దాయిని నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు.

పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మొగల్రాజపురంలోని పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ కేంద్రాన్ని గురువారం ఎన్నికల పరిశీలకురాలు ఎస్‌. నాగలక్ష్మి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది కోసం చేపట్టిన ఏర్పాట్లు, ఓటింగ్‌ ప్రక్రియ, వారికి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి, సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌కు అవకాశం ఉందని అర్హులైన ఎన్నికల సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డెప్యూటీ కమిషనర్‌ (రెవెన్యూ) జి. సృజన, మేయర్‌ రిటర్నింగ్‌ అధికారి, పీడీ హౌసింగ్‌ రజిని కుమారి పాల్గొన్నారు.

గురువారం పోలైన ఓట్లు..

గురువారం జరిగిన పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌లో మొత్తం 440 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో 183 మంది మహిళా ఓటర్లు కాగా 257 మంది పురుష ఓటర్లు ఉన్నారు.

సర్కిల్‌ వారీగా..

● సర్కిల్‌–1 పరిధిలోని 31 నుంచి 58 డివిజన్లకు జరిగిన పోలింగ్‌లో మొత్తం 96 మంది ఓటు హక్కు వినియోగించుకోగా వారిలో 43 మంది మహిళా ఓటర్లు, 53 మంది పురుష ఓటర్లు ఉన్నారు.

● సర్కిల్‌–2 పరిధిలోని 1, 59 నుంచి 86 డివిజన్లకు జరిగిన పోలింగ్‌లో మొత్తం 143 మంది ఓటర్లు పాల్గొనగా వారిలో 60 మంది మహిళా ఓటర్లు, 86 మంది పురుష ఓటర్లు పాల్గొన్నారు.

● సర్కిల్‌–3 పరిధిలో 2 నుంచి 30 డివిజన్లకు మొత్తం 201 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా వారిలో 80 మంది పురుష ఓటర్లు ఉండగా, 121 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పెనమలూరు: స్థానిక పేరంటాళ్ల చెరువులో వ్యక్తి ప్రమాదవశాత్తూ పడి గల్లంతయ్యాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కట్ట శివకృష్ణ(24) ఐదేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. అతనికి పిల్లలు లేరు. కామయ్యతోపులో పూలు అమ్ముకొని జీవిస్తాడు. కాగా అతను గురువారం చెరువు కట్ట పక్కనే ఉన్న ఇంటికి వెళ్లే సమయంలో ప్రమాదవశాత్తూ చెరువులో పడి గల్లంతయ్యాడు. స్థానికులు వెతకగా అతని ఆచూకీ తెలియలేదు. స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని శుక్రవారం రప్పించి చెరువులో గాలింపు చర్యలు చేపడతారు.

విజయవాడలీగల్‌: విజయవాడలో సంచలనం సృష్టించిన కూలింగ్‌ వాటర్‌ కెనాల్‌లో లభ్యమైన మహిళ మృతదేహం కేసులో నిందితుల బెయిల్‌ పిటీషన్‌ను డిస్మిస్‌ చేస్తూ 12వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి గురువారం ఉత్తర్వులిచ్చారు. వివరాల్లోకి వెళితే.. సెప్టెంబర్‌ నెల 18వ తేదీన ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్‌ పంప్‌హౌస్‌ వద్ద కూలింగ్‌ కెనాల్‌లో మహిళ మొండెం తేలుతున్నట్లు పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి డ్రోన్లు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సహాయంతో కెనాల్‌లోని శరీర భాగాలను వెలికితీశారు. మృతురాలు ఏలూరు జిల్లా కలిదిండి మండలం చిన్న తాడినాడకు చెందిన కర్రి దుర్గ కల్యాణి (29)గా గుర్తించారు. ఎటువంటి ఆధారాలు లేని ఈ కేసును సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, సోషల్‌ మీడియా సహాయంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. కాగా నిందితుల తరఫున న్యాయవాది జగన్నాథం వీఎన్‌ మణీంద్ర బెయిల్‌ పిటీషన్‌ దాఖలు చేయగా.. విచారించిన న్యాయవాది పైవిధంగా తీర్పు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement