పదేళ్లుగా బకాయి పడ్డ వారి ఆస్తులు బహిరంగ వేలం
ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే పలువురు ఆస్తులు సీజ్ రోడ్డున పడుతున్నామని వాపోతున్న వ్యాపార వర్గాలు ప్రభుత్వ ఆదేశాలతోనే చేస్తున్నామంటున్న అధికారులు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): మీరు ప్రభుత్వానికి జీఎస్టీ బకాయి పడ్డారా? అయితే మీ ఆస్తులు వేలం వేయటం ఖాయం! కూటమి ప్రభుత్వ పాలనలో వ్యాపారులపై వేధింపులకు పాల్పడటమే కాకుండా వారి ఆస్తులను సైతం లాక్కొని బకాయిలను రాబడుతున్నారు. సాధారణంగా ప్రభుత్వానికి బకాయిలు ఉంటే ముక్కు పిండి వసూలు చేయటం పరిపాటి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక వారి పేరు మీద ఎటువంటి ఆస్తులు ఉన్నప్పటికీ వాటిని స్వాధీనం చేసుకొని, బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు. గడిచిన ఏడాది కాలంగా ఈ తంతును ఉమ్మడి జిల్లా అధికారులు విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
ఆధార్‌కు లింక్ అయితే చాలు..
ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకొని, జీఎస్టీ లైసెన్స్ కలిగి ఉండి వ్యాపారాలు చేసే వారు దురదృష్టవశాత్తూ బకాయి పడితే వారి పని అయిపోయినట్లేనని పలువురు వ్యాపారులు వాపోతున్నారు. బకాయి పడిన వ్యక్తుల ఆధార్ నంబర్‌కు అటాచ్ అయినటువంటి ఆస్తులను అధికారులు సీజ్ చేస్తున్నారు. వాటినే కాదు ఆ పేరు మీద ఉన్న వాహనాలను సైతం సీజ్ చేసి, ఆ తరువాత బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు. ఈ తరహా చర్యలను గడిచిన ఏడాది కాలంగా విజయవాడ డివిజన్–1, డివిజన్–2, డివిజన్–3 పరిధు ల్లోని అధికారులు ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో చాలా వరకూ చేపడుతున్నారు.
వ్యాట్ బకాయిలు సైతం వసూళ్లు..
దేశంలో 2017 జూలై ఒకటో తేదీ నుంచి జీఎస్‌టీ పన్నుల విధానం అమలులోకి వచ్చింది. దానికి ముందు వ్యాట్ పన్నుల విధానం కొనసాగింది. 2005 నుంచి 2017 వరకూ వ్యాట్ అమలులో ఉంది. అయితే వ్యాట్‌లో గందరగోళంతో పాటుగా అధికారుల నిర్లక్ష్యం తదితర కారణాలతో చాలా రంగాలకు చెందిన వ్యాపారులు పన్నుల చెల్లింపులో కొంత ఇబ్బందులు పడ్డారు. ఆ తరువాత జీఎస్టీ అమలులోకి రావటం పాత బకాయిలు చెల్లించకపోవటం, అంతలో వ్యాపారాలు తగ్గి నష్టపోవటంతో చాలా మంది ప్రభుత్వానికి బకాయిలు ఉన్నారు. వారందరి నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బకాయిలు వసూళ్లకు చర్యలు చేపట్టింది. అప్పుడెప్పుడో బకాయిలు ఇప్పులు ఎలా అని అడిగితే తమ ఆస్తులను సీజ్ చేస్తున్నారని వ్యాపారులు వాపోతున్నారు.
ప్రతి వారం కలెక్టర్‌తో సమావేశం..
వాణిజ్య పన్నుల శాఖకు జీఎస్టీ బకాయిలు ఉన్న వ్యాపారుల ఆస్తులు సీజ్ చేయటం, బహిరంగ వేలం పాట నిర్వహించేందుకు ప్రతి వారం వివిధ శాఖలకు చెందిన అధికారులు సమావేశమవుతున్నారు. రిజిస్ట్రేషన్, రెవెన్యూ, పోలీసు, ఆర్టీవో శాఖ అధికారులతో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, కలెక్టర్ సమక్షంలో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిర్ణయాలపై క్రమం తప్పకుండా వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌కు నివేదికలు సమర్పిస్తున్నట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి.
వెయ్యి కోట్లకు పైగా బకాయిలు..
ఉమ్మడి కృష్ణాజిల్లాలో విజయవాడ డివిజన్–1, డివిజన్–2, డివిజన్–3 మూడు ప్రధాన కార్యాలయాలు 17 సర్కిల్ కార్యాలయాలను పర్యవేక్షిస్తున్నాయి. మూడు డివిజన్‌ల పరిధిలో సుమారుగా వెయ్యి నుంచి రూ.1400కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అందులో చాలా వరకూ వ్యాట్ సమయంలో బకాయి పడినవే అధికంగా ఉన్నట్లు అధికార వర్గాలు వివరిస్తున్నాయి. అవన్నీ ఏమైనా వసూళ్లు జరగాల్సిందేనని కూటమి ప్రభుత్వం వాణిజ్య శాఖపై ఒత్తిడి పెడుతుండటంతో మొత్తం మీద ఆస్తుల వేలం కార్యక్రమాలను అధికారులు చేపడుతున్నారు.
జిల్లాలో ఒక వ్యాపారి 2012 నుంచి 2015 మధ్య వాణిజ్య పన్నుల శాఖకు బకాయి పడ్డాడు. వ్యాపారం దెబ్బతినటంతో సంస్థను మూసివేశాడు. చాలా కాలం వ్యాపారానికి దూరంగా ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే అప్పట్లో వాణిజ్య పన్నుల శాఖ నోటీసులు జారీ చేసింది. కొంతమంది అధికారులు ముడుపులు పుచ్చుకొని దానిని దాటవేసి ‘ఏమి ఫర్వాలేదు’ అంటూ భరోసా ఇచ్చారు. అయితే గతేడాది ఆ వ్యక్తి తండ్రి మరణించారు. తండ్రి పేరు మీద ఉన్న ఆస్తి కుమారుడి పేరు మీదకు మారింది. అలాగే తండ్రి పేరు మీద బ్యాంకులో ఉన్న నగదు సైతం అతని ఖాతాలో చేరింది. ఆ ఆస్తి ఇలా పేరు మారిందో లేదో వెంటనే వాణిజ్య పన్నుల శాఖ దానిని సీజ్ చేసింది. అది ఉమ్మడి ఆస్తి ఐదుగురు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు పంచుకోవాల్సి ఉందని ఆ వ్యాపారి వాపోతున్నాడు. ఇటువంటి సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూటమి ప్రభుత్వ చర్యలతో వ్యాపార వర్గాలు లబోదిబోమంటున్నాయి.


