బిడ్డల ఆందోళన..
● ప్రభుత్వ స్థలం ఆక్రమణపై
ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం
● ఒక వర్గం దాడిలో స్పృహ తప్పి
పడిపోయిన మరో వర్గం మహిళ
● ‘అమ్మా లే’ అంటూ
విలపించిన చిన్నారి
● ఆక్రమణలను ప్రోత్సహిస్తున్న
అధికార పార్టీ నాయకులు
మైలవరం(జి.కొండూరు): ‘అమ్మా లే అమ్మా.. ఇంటికి వెళదాం.. నాకు భయమేస్తోంది’ అంటూ స్పృహతప్పి పడిపోయిన తల్లి వద్ద కూర్చొని చిన్నారి విలపించిన ఘటన చూపరులను కలిచివేసింది. స్థలం వివాదంలో మహిళపై మరో వర్గం దాడి చేసిన ఘటనలో ఆమె సంఘటనా స్థలంలోనే స్పృహ తప్పి పడిపోవడంతో లోకజ్ఞానం తెలియని ఆ చిన్నారి రోదనలు మిన్నంటాయి.
వివరాలు ఇవి..
ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్‌ను ఆనుకుని స్థానిక ఎమ్మెల్యే కార్యాలయానికి సమీపంలో ప్రభుత్వ స్థలం ఉంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రెండు వర్గాల టీడీపీ నాయకుల అండదండలతో కొందరు ఈ స్థలాన్ని ఆక్రమించి దుకాణాలను ఏర్పాటు చేశారు. వారిలో కొందరు వ్యాపారాలు చేస్తుండగా కొందరు నెలకు రూ.4 వేల నుంచి రూ.10 వేల వరకు అద్దెలకు ఇస్తూ ఆదాయం పొందుతున్నారు. రెడ్డిగూడెం మండలం రుద్రవరం గ్రామానికి చెందిన అజ్మీరా జ్యోతి, నాగేశ్వరరావు దంపతులు మైలవరంలో నివసిస్తూ.. ఆ ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన ఓ దుకాణాన్ని నెలకు రూ.4వేలకు అద్దెకు తీసుకొని టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎ.కొండూరు మండలం కృష్ణారావుపాలేనికి చెందిన షేక్ షకీల అదే ప్రభుత్వ స్థలంలో కొంత ఆక్రమించి దుకాణాన్ని ఏర్పాటు చేశారు. ఈ దుకాణం పక్కన ఖాళీగా ఉన్న స్థలంలో టైలరింగ్ చేస్తున్న అజ్మీరా జ్యోతి తాను కూడా సొంత షాపు ఏర్పాటు చేసుకునేందుకు ఆదివారం పాత బడ్డీకొట్టును అక్క డకు చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న షకీల, ఆమె కుటుంబ సభ్యులు నలుగురు కలిసి అక్కడికి చేరుకొని ఆ స్థలం తమదంటూ బడ్డీకొట్టును తొలగించి అజ్మీరా జ్యోతితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరగడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో అజ్మీరా జ్యోతి స్పృహ తప్పి పడిపోయింది.
తల్లి ఒక్కసారిగా కుప్పకూలి స్పృహ తప్పి పడిపోవడంతో అక్కడే ఉన్న ఆమె కుమారులు ఏడేళ్ల శ్రీధర్, 15 ఏళ్ల సిద్ధార్థ రోదించడం ప్రారంభించారు. దీంతో స్థానికులు క్షతగాత్రురాలు జ్యోతిని 108 అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న మైలవరం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడమేంటని స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. టీడీపీ నాయకులు రెండు వర్గాలు విడిపోయి ఈ ఆక్రమణలను ప్రోత్సహిండం వల్లనే వివాదాలు తలెత్తి దాడులు జరుగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు.


