యజమానుల బైక్‌ను ఢీకొట్టి వ్యాన్‌లో పారిపోయిన దొంగలు
పెనమలూరు: పెదపులిపాకలో పశువులు దొంగతనం చేయటానికి వచ్చిన ముఠాపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదపులిపాక శివారు తాడిగడప రోడ్డులో కోగంటి రాజేష్, కోగంటి రాజేంద్ర పశువుల పెంపకానికి షెడ్డు ఏర్పాటు చేసుకున్నారు. షెడ్డులో గేదెలు, గొర్రె పోతులు, కోళ్లు పెంచుతున్నారు. అయితే శనివారం రాజేష్, రాజేంద్ర షెడ్డుకు తాళాలు వేసి ఇంటికి వెళ్లారు.
వారు అర్ధరాత్రి తిరిగి వచ్చే సరికి పశువులు దొంగతనం చేసే ముఠా ఎదురుగా ఉన్న వెంచర్‌లో ఏపీ 39యూ 2716 నంబర్ కలిగిన వ్యాన్ నిలిపి షెడ్డు తాళాలు పగులకొట్టి గేదె, గొర్రె పొట్టేళ్లను వ్యాన్‌లోకి ఎక్కించారు. ఇది గమనించిన షెడ్డు యజమానులు కేకలు వేస్తూ వ్యాన్ వద్దకు వెళ్లారు. తమ బైక్‌ను వ్యాన్‌కు అడ్డుగా నిలుపగా దొంగల ముఠా బైక్‌ను వ్యాన్‌తో ఢీ కొట్టి ఆగకుండా పారిపోయారు. ఈ గందరగోళంలో వ్యాన్‌లో ఉన్న గేదె, గొర్రె పొట్టేళ్లు వ్యాన్ నుంచి కిందకు దూకాయి. పశువులను సురక్షితంగా షెడ్డుకు తరలించి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వ్యాన్ నంబర్ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు.


