వనటౌన్(విజయవాడపశ్చిమ): ఐక్యంగా సాగినప్పుడే సమస్యల పరిష్కారం, విజయాలు సాధ్యమవుతాయని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, న్యాయబద్ధమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్రంలోని రెండు ప్రధాన యూనియన్లు ఒకే వేదికపైకి వచ్చి సంయుక్త కార్యాచరణను ప్రారంభించాయి. ఈ సందర్భంగా రాష్ట్ర పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్స్ ఐక్యవేదిక సమావేశం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఎస్‌టీయూ భవన్‌లో ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ల ఐక్యవేదిక ప్రతినిధులు సీహెచ్ దేవేంద్రరావు, హాజీ మలంగ్ అధ్యక్షత వహించారు. ఫ్యాఫ్టో చైర్మన్ లంకపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, నాయకులు జోసఫ్ సుధీర్‌బాబు, ఎస్‌టీయూ అధ్యక్షుడు మల్లు రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు.
పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ల ప్రతినిధులు ప్రస్తావించిన న్యాయబద్ధమైన డిమాండ్లను రాష్ట్ర జేఏసీ దృష్టికి తీసుకువెళ్లి, ఈ అంశంపై అక్కడ తీర్మానం ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వివిధ జిల్లాల నుంచి హాజరైన పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ల అధ్యక్షులు, కార్యదర్శులు, మండల బాధ్యులు, సభ్యులు తమ ప్రాంతాల్లోని సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ముగింపులో పార్ట్‌టైం ఇన్ స్ట్రక్టర్స్ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం రెండు సంఘాలు సమన్వయంతో, ఐక్యంగా ముందుకు సాగాలని నిర్ణయించారు.


