అన్నదానానికి విరాళం | - | Sakshi
Sakshi News home page

అన్నదానానికి విరాళం

Sep 21 2026 6:59 AM | Updated on Sep 21 2026 6:59 AM

అన్నదానానికి విరాళం ఘనంగా ఆర్‌పీఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవం ఉత్సాహంగా పోటీలు

మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో నిర్వహించే శాశ్వత అన్నదానం నిమిత్తం విజయవాడకు చెందిన పి. రాజ్యలక్ష్మి రూ. 1.15లక్షల విరాళంగా సమర్పించుకున్నారు. ఆదివారం ఉదయం ఆలయానికి చేరుకుని స్వామివార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం పివికే శేషాచార్యులు జ్ఞాపకార్థం వారి భార్య రాజ్యలక్ష్మి తరఫున చల్లపల్లి గ్రామ మాజీ ఉపసర్పంచ్‌ ముమ్మనేని నాని ఈ విరాళాన్ని ఆలయ డెప్యూటీ కమిషనర్‌ దాసరి శ్రీరామ వరప్రసాదరావుకు అందజేశారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు.

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): ఆర్‌పీఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్‌ ఆర్‌పీఎఫ్‌ అధికారులు, సిబ్బంది పలు సామాజిక సేవా కార్యక్రమాలతో వేడుకలు నిర్వహించారు. అందులో భాగంగా డివిజన్‌ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, మొక్కల పెంపకం, ప్రయాణికుల అవగాహన కార్యక్రమాలు, యోగా, అనాథ, వృద్ధ ఆశ్రమాల్లో సేవా, సురక్షా సమ్మేళనాలు, శ్రమదానం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. గత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ 19 వరకు రైల్వే ఆస్తుల పరిరక్షణలో ఆర్‌పీఎఫ్‌ సాధించిన విజయాలను ప్రయాణికులతో పంచుకున్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆర్‌పీఎఫ్‌ ఇటువంటి పటిష్టమైన చర్యల ద్వారా విజయవాడ ఆర్‌పీఎఫ్‌ లక్షలాది మంది ప్రయాణికులకు సురక్షితమైన, క్రమశిక్షణతో కూడిన ప్రయాణ వాతావరణాన్ని కల్పిస్తోందని అధికారులు తెలిపారు.

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): దక్షిణ కోస్తా రైల్వే, విజయవాడ డివిజన్‌ ఉమెన్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో నాన్‌–గెజిటెడ్‌ రైల్వే ఉద్యోగుల పిల్లలకు ఆదివారం ఆన్‌–స్పాట్‌ డ్రాయింగ్‌, పెయింటింగ్‌ పోటీలను నిర్వహించారు. వయస్సుల వారీగా మూడు విభాగాల్లో విజయవాడలో ఆదివారం నిర్వహించిన ఈ పోటీలలో 452 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఆర్గనైజేషన్‌ ప్రెసిడెంట్‌ వర్షా సోనాకియా ఈ పోటీలను పర్యవేక్షించి పాల్గొన్న పిల్లలందరికీ బహుమతులు అందజేసి ప్రోత్సహించారు. ముందు రోజు నిర్వహించిన వ్యాస రచన పోటీలలో కూడా 270 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

పాప ప్రక్షాళన చేసుకోండి

గన్నవరం: శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని ఈడీ, సీబీఐ స్పష్టమైన నివేదికలు ఇచ్చిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ కలిసి తిరుపతి వెళ్లి చెంపలు వేసుకుని పాప ప్రక్షాళన చేసుకోవాలని వైఎస్సార్‌ సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఆదివారం ఆయన మాట్లాడారు. రాజకీయ స్వలాభం కోసమే తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్‌ సీపీపై దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు. దేవుడిని రాజకీయాలకు వాడుకోవడం దైవ తప్పిదమని, కర్మ సిద్ధాంతం ఎవరినీ వదిలిపెట్టదని పేర్కొన్నారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు, పవన్‌, లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, యావత్‌ హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేశంలో నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీకి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ బాధ్యత వహించినట్లుగానే రాష్ట్రంలో జరిగిన డీఎస్సీ అక్రమాలకు మంత్రి లోకేశ్‌ బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement