గణేష్‌ ఉత్సవాలు ప్రశాంతంగా సాగాలి | - | Sakshi
Sakshi News home page

గణేష్‌ ఉత్సవాలు ప్రశాంతంగా సాగాలి

Sep 8 2026 2:11 AM | Updated on Sep 8 2026 2:11 AM

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): జిల్లాలో గణేష్‌ ఉత్సవాలను అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ ఆదేశించారు.జిల్లాలో గణేష్‌ ఉత్సవాల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.గణేష్‌ ఉత్సవ సమితి సభ్యులతో ఉత్సవాల నిర్వహణ, వినాయక ప్రతిమల ఏర్పాటు, పందిళ్లకు అనుమతులు, విద్యుత్‌ భద్రత, అగ్నిమాపక భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణ, నిమజ్జన ఏర్పాట్లు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ మాట్లాడుతూ గతేడాది జిల్లాలో ఐదు లక్షల మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసి ప్రపంచ రికార్డు సాధించడంతోపాటు గణేష్‌ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించామన్నారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు నిబంధనలను పాటిస్తూ అధికారులకు సహకరించాలని కోరారు. వినాయక చవితి పందిళ్ల ఏర్పాటుకు స్థలాలను పరిశీలించి, నిర్వాహకులు తగిన భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? లేదా? అనే అంశాలను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారులను పూర్తిగా లేదా పాక్షికంగా మూసివేసేలా పందిళ్లను ఏర్పాటు చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదన్నారు. డీజేలు పరిమితులకు లోబడి ఏర్పాటు చేసుకోవాలని, పందిళ్ల వద్ద శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు.

నిమజ్జన ప్రాంతాలను గుర్తించాలి..

గణేష్‌ విగ్రహాల నిమజ్జనానికి అనువైన ప్రదేశాలను అధికారులు ముందుగానే గుర్తించి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఇగ్నైట్‌ సెల్‌లో మట్టి వినాయక ప్రతిమలను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు పూర్తి సహకారం అందిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, జిల్లా విద్యుత్‌ శాఖ అధికారి యు.హనుమయ్య, గణేష్‌ ఉత్సవ సమితి సభ్యులు బిట్ర వెంకటేష్‌, వై. కిషోర్‌, లోయ బాలకృష్ణ, జీవీఎస్‌ రమణమూర్తి, వి.పల్లవరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement